అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే 108 వాహనాలే ఇప్పుడు అత్యవసర స్థితిని ఎదుర్కొంటున్నాయి. జిల్లావ్యాప్తంగా 33 వాహనాలు సేవలందించాల్సి ఉండగా, ఇప్పటికే పలు ప్రాంతాల్లోని వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. షెడ్డుకు చేరి, రోజుల తరబడి మరమ్మతులకు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు మరికొన్ని వివిధ సమస్యల కారణంగా నామమాత్రపు సర్వీసులతో కాలాన్ని నెట్టుకొస్తున్నాయి. గతంలో వీటి నిర్వహణను జీవీకే(గ్రంధి వెంకట కృష్ణారెడ్డి) గ్రూప్ సంస్థలు నిర్వహించగా, ఈ ఏడాది నుంచి ప్రభుత్వం భారత్ నివాస్ గ్రూప్ సంస్థకు అప్పగించింది.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో 108 వాహనాలు మరమ్మతులకు గురవటంతో షెడ్లకు తరలించారు. వీటిని బాగు చేయించేందుకు అవసరమైన నిధులను సంబంధిత గుత్తేదారు సంస్థ చెల్లించకపోవటంతో ఈ దుస్థితి నెలకొంది. చాట్రాయి మండలంలో సేవలందించే 108 వాహనం జులై 4వ తేదీన మరమ్మతులకు గురవగా షెడ్డుకు తరలించారు. నాటి నుంచి ఆ మండలంలో విస్సన్నపేట వాహనమే సేవలందిస్తూ ఆగస్టు 14న ఇదీ మరమ్మతులకు గురవటంతో షెడ్డుకు తరలించారు. నేటి వరకు వీటికి మరమ్మత్తుల్లేక ఈ రెండు మండలాల్లో తలెత్తే అత్యవసర పరిస్థితులకు మరో మండలం నుంచి వాహనం రావలసిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇబ్రహీంపట్నం, ఆగిరిపల్లి, రామవరప్పాడు(విజయవాడ), కలిదిండి వాహనాలు కూడా మరమ్మతులకు నోచక షెడ్లకు పరిమితమయ్యాయి. వీటిని పూర్తిస్థాయిలో బాగు చేయించేందుకు గూడవల్లిలోని జాస్పర్ ఇండస్ట్రీస్, విజయవాడ ఆటోనగర్‌లోని షెడ్లలో నిలిపి ఉంచారు. నూజివీడులో వాహనం మరమ్మతులకు గురవటంతో సేవలను కేవలం నూజివీడు పట్టణానికే పరిమితం చేసి, మండలంలోని ప్రాంతాలకు ఇతర మండలాల వాహనాల సేవలపై ఆధారపడుతున్నారు. ఇలాగే నడిస్తే నూజివీడు పట్టణంలో సేవలందించే వాహనం మరికొద్ది రోజుల్లో షెడ్డుకు పరిమితం కావలసిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.
ప్రమాదకర పరిస్థితుల్లో సేవలందిస్తున్న 108 వాహనాల్లో నిరంతరం అందుబాటులో ఉండాల్సిన వైద్యపరికరాలు చాలీచాలని దుస్థితి నెలకొంది. జిల్లాలోని పలు వాహనాల్లో అవసరాల మేరకు దూది, కట్టు కట్టే గుడ్డలు, మాస్కులు, చేతి తొడుగులు, సెలైన్ బాటిళ్లు లేవు. మరికొన్ని వాహనాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉంది. ఈసీజీ యంత్రాలు సైతం మరమ్మతులకు గురైతే, సకాలంలో ఇవి అందుబాటులోకి రాని పరిస్థితి. వాహనాల నిర్వహణకు ఉన్నతాధికారులు అందిస్తున్న వైద్య ఉపకరణాలు అరకొరగా ఉండటంతో వీటినే పొదుపుగా సిబ్బంది వినియోగించుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో కట్టు కట్టేందుకు గుడ్డలు చాలక, అందుబాటులో ఉన్న వస్త్రాలతో కట్టి, క్షతగాత్రులను ఆసుపత్రులకు తీసుకెళుతున్న సంఘటనలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి.
ఏ మండలంలో అయినా 108 వాహనం మరమ్మతుకు గురై, నిలిచిపోతే అక్కడ అస్తిత్వ పరిస్థితి నెలకొంటోంది. మరమ్మతుకు గురైన వాహనాన్ని షెడ్డుకు తరలిస్తే ఎప్పుడొస్తుందో తెలియటంలేదు. వాహనం వచ్చే వరకు ఖాళీగా ఉన్న సిబ్బందికి జీతాలు చెల్లించటంలేదు. నెలల తరబడి వేతనాలు రాక సిబ్బంది జీవనం కోసం మరో ప్రత్యామ్నాయానికి వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిన ప్రాంతాల్లో సిబ్బంది లేక బాగు చేసిన వాహనాలు చేరుకోని పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో పనిచేస్తున్న 108 సిబ్బందికి సుమారు రెండు నుంచి నాలుగు మాసాల జీతాలు చెల్లించకపోవటంతో పలుచోట్ల ఇతర పనులకు వెళ్లిపోయారు. మరమ్మతుకు గురైన వాహనాలు తిరిగి రాకపోతాయా, తమకు జీతాలు చెల్లించకపోతారా అనే ఆశతో మరికొన్ని ప్రాంతాల్లోని సిబ్బంది ఎదురుచూస్తూ రోజులు గడుపుతున్నారు.