ఏజెన్సీ ఏరియాలో ఇప్పటి వరకు కాఫీ, తేనె, చింత పండు వంటి వివిధ రకాల అటవీ ఉత్పత్తులతో వ్యాపార లావాదేవీలు సాగిస్తున్న ప్రభుత్వం తాజాగా పనస పళ్లతో వ్యాపారం చేయాలని నిర్ణయించింది. షెడ్యూల్డ్ ఏరియాలోని పాడేరుతో సహా ఇతర ఐటిడిఏ పరిధిలో ఇందుకు సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టును రూపొందించే పనిలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నిమగమయ్యారు. బయట మార్కెట్‌లో పనసకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పండే అటవీ ఫలాల్లో పనస కూడా ఒకటి. దీని ద్వారా కూడా గిరిజనులకు జీవనోపాధిని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు వారు చెబుతున్నారు. దీనికి ఎంత ఖర్చు అవుతుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ ( జిసిసి ), గిరిజన ఫైనాన్స్ కార్పొరేషన్ ( ట్రైకార్ )ల ఆధ్వర్యంలో దీనిని అమలు చేయాలని భావిస్తున్నారు. కేరళ తరహాలో పనస వ్యాపారం చేపట్టాలని ఆలోచనలు చేస్తున్నారు. అక్కడ దీనిని ఏ విధంగా నిర్వహిస్తున్నారనే అంశం పై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర గిరిజన సంక్షే శాఖ అధికారుల బృందం ఇదివరకే కేరళ పర్యట నకు వెళ్లింది. పనస పళ్లను కేవలం తినేందుకే కాకుండా, పనస కాయతో అప్పడాలు, పచ్చడి వంటి అనేక రకాలైన ఆహార పదార్థాలను తయారు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 2లక్షల నుంచి 2.50 లక్షల పనస చెట్లు ఉన్నాయని చెబుతున్న అధికారులు, పాడేరుతో పాటు తక్కిన ఐటిడిఏల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఒక్కో చెట్టు కు సగటున ఎన్ని ఫలాలొస్తున్నాయనే అంశంపై సర్వే చేసే పనిలో ఉన్నారు. పూర్తి స్థాయి నివేదిక అందాక, పాడేరు కేంద్రంగా ప్రాజెక్టును ప్రారంభించే అవకాశముంది.