స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటివరకు స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించి నగరాలు, పట్టణాల్లో సర్వే చేపట్టి ర్యాంకులు కేటాయిస్తున్న స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ గ్రామాల్లో సర్వే చేపట్టాలని నిర్ణయించింది. గ్రామంలో ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా, లేదా అనే విషయమై సర్వే చేపడతారు. స్వచ్ఛ సర్వేక్షణ్ నిబంధనలకు అనుగుణంగా మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం ఉంటే 35 మార్కులు కేటాయిస్తారు. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ సంస్థల్లో పారిశుద్ధ్య ప్రత్యక్ష పరిశీలనపై సర్వే చేపట్టి సంతృప్తి చెందితే 30 మార్కులు వేస్తారు. గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు 35 మార్కులు కేటాయించనున్నారు. ఈ సర్వే ఆధారంగా మార్కులు కేటాయించి జాతీయ స్థాయి పురస్కారానికి సర్వే బృందం సిఫార్సు చేసే అవకాశం ఉంటుంది.ఈ సర్వేలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులపై స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 సర్వే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగై సర్వేలో భాగంగా మంచి మార్కులు వస్తే ఈ ఏడాది అక్టోబరు 2న జాతీయ స్థాయి పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించనుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో స్వతంత్ర బృందం జిల్లాలో ఇప్పటికే సర్వే ప్రారంభించింది.ఎస్‌ఎస్‌జీ 18 యాప్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ: స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో భాగంగా ఎస్‌ఎస్‌జీ 18 యాప్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. గూగుల్‌ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని భాషను ఎంపిక చేసుకోవాలి. అనంతరం రాష్ట్రం, జిల్లాను ఎంపిక చేసుకోవాలి. తర్వాత రీసెట్ అని వస్తుంది. అప్పడు నాలుగు అంశాలపై ప్రశ్నావళి వస్తుంది. వాటిలో నచ్చిన ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. అభిప్రాయం తెలిపినందుకు అభినందనలు అంటూ మెసెజ్ వస్తుంది. ఈ యాప్ ద్వారా సేకరించే ప్రజాభిప్రాయంలో నాలుగు ప్రశ్నలు వస్తాయి. 1) స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2018 మిషన్ గూర్చి మీకు తెలుసా? 2) స్వచ్ఛ భారత్ మిషన్ అమలు చేయడం ద్వారా మీ గ్రామంలో సాధారణ పారిశుద్ధ్యం ఎంతవరకు మెరుగుపడింది? 3) ఘన వ్యర్ధాలు, చెత్తను సురక్షితంగా పారవేయడానికి ఏర్పాట్లు ఉన్నాయా? 4) ద్రవ వ్యర్ధాల నిర్వహణకు గ్రామ స్థాయిలో ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? అనే నాలుగ ప్రశ్నలకు సమాధానం సేకరిస్తారు.
ప్రజాభిప్రాయ సర్వేలో భాగంగా జిల్లాకు మంచి మార్కులు సాధించాలంటే జిల్లాలోని ప్రతి ఒక్కరూ స్పందించడం ద్వారానే సాధ్యపడుతుంది. జిల్లా జనాభాలోని 5 శాతం మంది సుమారుగా 4 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తమ అభిప్రాయాలను తెలియజేయడం వల్ల జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ పురస్కారం సాధించేందుకు అవకాశం ఉంటుంది.