శ్రీవెంకటేశ్వర కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు రైతుల పాలిట కల్పతరువుగా ఉన్నాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాయి. అలాంటి ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. అందులో పని చేస్తున్న శాశ్విత ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడ్డారు. చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీని 2014 జనవరిలో, గాజుల మండ్యం షుగర్ ఫ్యాక్టరీని 2015 డిసెంబరులో మూసివేశారు. జిల్లాలో సహకార రంగంలో నడుస్తున్న రెండు షుగర్ ఫ్యాక్టరీలు మూత పడడంతో ఉద్యోగులు, కార్మికులు ఉపాధిలేక రోడ్డు పాలయ్యారు. ప్రభుత్వం కనీసం వేతనాలు చెల్లించక పోవడంతో వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఎప్పటికప్పుడు వేతనాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే చిత్తూరు ఫ్యాక్టరీలో నాలుగున్నర సంవత్సరాలు, గాజులు మండ్యం ఫ్యాక్టరీలో మూడేళ్లుగా వేతన బకాయిలు చెల్లించకపోవడంతో వారి వేదన వర్ణనాతీతంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీలో శాశ్విత ప్రాతిపదికన 48 మంది ఉద్యోగులు, సీజనల్ సమయంలో 17 మంది, కాంట్రాక్టు కింద 273 మంది కార్మికులు పని చేస్తున్నారు. గాజులమండ్యంలో శాశ్విత ఉద్యోగులు 54 మంది, సీజన్‌లో 38 మంది, కాంట్రాక్టు కింద 146 మంది కార్మికులు పని చేస్తున్నారు. రెండు ఫ్యాక్టరీల్లో సుమారు 576 మంది పని చేస్తున్నారు. ఒక్కసారిగా ఫ్యాక్టరీలు మూతపడడంతో ఆయా ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. చిత్తూరు ఫ్యాక్టరీలో గత నాలుగున్నర ఏళ్లుగా ఉద్యోగులకు, కార్మికులకు కలిసి రూ.26.24 కోట్లు వేతన బకాయిలు చెల్లించాలి. అలాగే గాజులమండ్యం ఫ్యాక్టరీలో అయితే మూడేళ్లుకు కలిసి రూ.13.50కోట్లు వేతనాలు చెల్లించాల్సి ఉంది. వేతనాల బకాయిలు చెల్లించక పోవడంతో అప్పులుచేసి జీవనం సాగిస్తున్నామని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి వేతనాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రెండు దఫాలు కలిసి విన్నవించాం. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సంబంధిత శాఖ అధికారులను పిలిచి అందుకు సంబంధించి దస్త్రాలు తయారు చేసి తన వద్దకు రావాలని ఆదేశించారు. అయితే ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద వేతనాలకు సంబంధించి దస్త్రాలు కదలడంలేదు. ముఖ్యమంత్రి ఓ సారి దృష్టి సారించి వేతనాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడంతో పాటు ఫ్యాక్టరీలు పునః ప్రారంభించి రైతులను ఆదుకోవాలి.