రాష్ట్రంలో మరో రెండు మూడు నెలల్లో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ముందుగా విజయవాడలో పైలెట్ ప్రాజెక్టుగా రెండు బస్సులను నడపనున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే మరో రెండు బస్సులు నడపడంతో పాటు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను నెలకొల్పనున్నారు. ఈ ఏడాది విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్టనర్ సమ్మిట్ లో ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తిపై ఏపీఎస్ ఆర్టీసీ, ఏపీ ట్రాన్స్ కో, నెడ్ క్యాప్‌తో బెలారస్‌కు చెందిన యాక్సిస్ మొబలిటీ సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది.పర్యావరణ పరిరక్షణతో పాటు డీజిల వినియోగం తగ్గించడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. దీనిలో భాగంగా ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగించాలని నిర్ణయించామన్నారు. ముఖ్యంగా ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, సామర్థ్యం గురించి యాక్సిస్ అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పనితీరుపై ఆ సంస్థ ప్రతినిధి రవికుమార్ రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో తమ సంస్థకు 40 ఏళ్లకు పైగా అనుభవముందని ఆ సంస్థ ప్రతినిధి రవికుమార్ రెడ్డి తెలిపారు. 9 మీటర్లు, 12 మీటర్లు, 18 మీటర్లు పొడవు కలిగిన మూడు మోడళ్లను ఉత్పత్తి చేస్తున్నామన్నారు. వాటిలో 12 మీటర్ల పొడవు కలిగిన బస్సులు ఏపీ రోడ్లకు సరిపోయే విధంగా ఉంటాయన్నారు. ఈ బస్సులో 75 నుంచి 87 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్ల వరకూ బస్సు ప్రయాణిస్తుందన్నారు.ఐదు నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తవుతుందన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంతో ఎటువంటి కాలుష్య ఉండదన్నారు. విజయవాడలో ప్రయోగాత్మకంగా రెండు ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఇందుకు నగరంలో ఒక ఛార్జింగ్ సెంటట్ ను నెలకొల్పనున్నామన్నారు. డీజిల బస్సు కంటే ఎలక్ట్రిక్ బస్సు నిర్వహణ మూడో వంతు మాత్రమే వ్యయమవుతుందన్నారు. బస్సులోకి వీల్ చైర్ తో వెళ్ల విధంగా ప్లాట్ ఫాం కూడా రూపొందించామన్నారు. కిలో మీటర్ కు రూ.40ల వరకూ వ్యయమవుతుందన్నారు. దీన్ని రూ.35లకు తగ్గించే విధంగా సాంకేతిక వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు. ఏసీ సౌకర్యంతో పాటు వై ఫై, జీపీఎస సిస్టమ్ ఉంటుందన్నారు. ఈ బస్సు కాలపరిమితి 15 ఏళ్ల అని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సు స్పీడ్ లిమిట్ గంటకు 60 కిలో మీటర్లని వివరించారు. రెండు మూడు నెలల్లో రెండు బస్సులను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. మిగిలిన రెండు బస్సులు మరో రెండు నెలల్లో నడపనున్నామన్నారు. బస్సులను ఉచితంగా అందజేస్తున్నందున్న వాటి దిగుమతికయ్యే కస్టమ్స్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం మినహాయించాలని ఆయన కోరారు