పల్లె, పట్టణం, నగరం తేడా లేదు! ఇక... ఊరూరా ఉచితంగా వైఫై! త్వరలోనే గూగుల్ ఈ సేవలను రాష్ట్రమంతటా విస్తరించనుంది. ఈ మేరకు గూగుల్‌తో రాష్ట్ర ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లలో గూగుల్ కూడా పాల్గొని విజయవంతంగా ఈ పనులను దక్కించుకుంది. . ప్రస్తుతం ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ‘రైల్ టెల్’ పేరిట గూగుల్ వైఫై సేవలను అందిస్తోంది.ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే ప్రయాణికుడి మొబైల్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ వస్తుంది. 45 నిమిషాలపాటు ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. ఇప్పుడు... రాష్ట్రవ్యాప్తంగా 12,900 గ్రామాలతోపాటు పట్టణాలు, నగరాలకు ఈ సేవలు విస్తరించనున్నాయి. ఏపీఎస్ ఎఫ్ ఎల్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం... జీ-స్టేషన్ల వద్ద 45 నిమిషాల నుంచి గంట వరకూ ఒకే సెషన్ (దఫా)లో ఉచితంగా ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవచ్చు. ఈ సమయం ముగిశాక.. మళ్లీ మరో సెషన్‌కు వెళ్లవచ్చు. ఇలా విడతల వారీగా రోజులో ఎంతసేపైనా నెట్ వాడుకోవచ్చు. ఒక్కో ఊరికి రెండు చొప్పున రద్దీ ప్రాంతాలను ఎంచుకుని రూటర్లు ఏర్పాటు చేస్తారు. మునిసిపాలిటీల్లో వార్డుకు రెండు చొప్పన దాదాపు 4000 చోట్ల రూటర్లను ఏర్పాటు చేస్తారు.ఉచిత వైఫై సేవలు అందించేందుకు గూగుల్‌తో ఒప్పందం చేసుకున్న ఏపీఎస్ ఎఫ్ ఎల్... రూటర్ల సరఫరా కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద రూటర్లను ఏర్పాటు చేస్తామని ఏపీఎ్‌సఎ్‌ఫఎల్ సీఈవో దినేశ్ కుమార్ చెప్పారు. దీంతోపాటు... గూగుల్ యాప్ ఉండే ఆండ్రాయిడ్ టెలివిజన్ ఉన్న వారికి ప్రత్యేక సెట్‌టాప్ బాక్సులను అందజేస్తామన్నారు. వీటిద్వారా ‘మీ సేవ’ కింద పౌరులకు అందజేస్తున్న సేవలన్నీ వినియోగించుకునే వీలుంటుందన్నారు. ఇందుకోసం వాయిస్ ఓవర్ యాప్‌నీ గూగుల్ అందజేస్తుందని అన్నారు