వాడుకనీరు, వర్షం నీరు ప్రవహించాల్సిన గెడ్డలు జివిఎంసి అధికారులు మెతక వైఖరితో కనుమరుగవుతున్నాయి. పర్యవసానంగా పల్లపు ప్రాంతాలు భారీ వర్షాలకు ముంపు తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, మధురానగర్, రైల్వే న్యూ కాలనీల్లో గెడ్డలు గతంలో 40 అడుగుల మేర ఉండేవని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. విశాఖపట్నం పేరు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌గా 2007లో అప్పటి కౌన్సిల్‌లో తీర్మానించారు. విశాఖ పేరుతో పాటు జనాభా కూడా పెరుగుతూ వస్తుంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి మరో అడుగు ముందుకేసి విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించారు. దీంతో నగరంలో ఉన్న ఏరియాలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరలు పెంచుతూ వచ్చింది. టిడిపి అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో రెండుసార్లు భూముల ధరలు పెంచారు. దీంతో గెడ్డలు, కాలువలను ఆనుకుని ఉన్న స్థానికులు కొంచెం, కొంచెం ఆక్రమిస్తూ, గెడ్డలను కబ్జా చేస్తున్నారు. టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ అధికారులు పర్యవేక్షలో కనబడితే ఆమ్యామ్యాలు ముట్టజెబుతుండటంతో కిమ్మనకుండా వెనుదిరుగుతున్నారు. సుమారు 3 దశాబ్ధాలుగా ఇలా నగరం అభివృద్ధి చెందుతూ ఉండగా, కబ్జాకోరుల చేతుల్లోకి సగానికి పైగా గెడ్డలు ఆక్రమణ జరిగిపోయింది. విశాఖ నగరం ఎత్తు, పల్లాలతో సుందరంగా ఉంటుందని, అక్కడ వరదలు రావని ఇతర పట్టణాల వారు గట్టిగా నమ్ముతున్నారు. కాగా నగరంలో గెడ్డల పరిస్థితి పరిశీలిస్తే ఇప్పటికే సగం ఆక్రమణకు గురై కొన్ని, చెత్తా, చెదారంతో దర్శనమిస్తూ కొన్ని ప్రాంతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గెడ్డలను ఆక్రమణకు గురి కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోకుంటే నగరానికి వరద ప్రమాదం పొంచి ఉందని మేధావులు భావిస్తున్నారు