YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అలంకార ప్రాయంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు

అలంకార ప్రాయంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు
అత్యవసర సమయంలో వెంటనే చికిత్స అందిస్తే ప్రమాద తీవ్రత తగ్గుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం బస్సులు, పాఠశాలల్లో మందులు, బ్యాండేజీలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టెలను బస్సులు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గాయాలైతే ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ప్రథమ చికిత్స చేసి తీవ్రతను కొంతవరకు తగ్గించేందుకు ఈ ప్రథమ చికిత్స పెట్టెలు ఉపయోగపడేవి. కానీ ప్రస్తుతం అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. రవాణా వాహనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ పథకం పనులు జరిగే ప్రదేశాలు.. ఇలా జనసంచారం ఉండే ప్రతి ప్రదేశంలోనూ ప్రథమ చికిత్స సదుపాయం ఉండాలి.బస్సుల్లో పెట్టెలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉన్నతాధికారులు వీటి గురించి పట్టించుకోకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. నిబంధనల ప్రకారం ఈ పెట్టెల్లో అత్యవసరమైన మందులు, గాయాలకు అవసరమైన హైడ్రోజన్‌ పెరాక్సయిడ్, అయొడిన్, దూది వంటివి ఉండాలి. కడుపు నొప్పి, జ్వరం, విరేచనాలు, ఇన్‌ఫెక్షన్లను నియంత్రించే అత్యవసర మందులు, ఇతర సామగ్రి ఉంచాలి. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, ఇతర చిన్నపిల్లలు, విద్యార్థులుండే ప్రదేశాల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన సామగ్రి సహా శిక్షణ పొందిన సహాయకులు ఉండాలి.కానీ పలు వసతి గృహాలకు ఇటీవలే తాత్కాలికంగా ఏఎన్‌ఎంలను నియమించడంతో హాస్టళ్లను మినహాయించి మరెక్కడా ప్రథమ చికిత్సలకు అవసరమైన పెట్టెలు కనిపించడం లేదు. పాఠశాలల్లో అయితే ఎప్పుడో సమీపంలోని పీహెచ్‌సీ నుంచి వచ్చే వైద్యాధికారులు నిర్వహించే ఆరోగ్య పరీక్షలప్పుడు విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు ముందు జాగ్రత్తగా కొన్ని రకాల మందులు తీసుకుంటున్నారే తప్పా, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు పూర్తిస్థాయిలో ఉండటం లేదు.అత్యవసర వైద్య సేవల గురించి ప్రభుత్వ శాఖలు పట్టించుకోవడం మానేశాయి. బస్సులు, ప్రయివేటు వాహనాలు,పాఠశాల బస్సులు, ప్రయివేటు పాఠశాలల్లో కూడా ఇలాంటి సదుపాయం ఉందా? లేదా? అనే విషయాన్ని రవాణా శాఖ, ఆర్టీసీ, విద్యాశాఖాధికారులు పర్యవేక్షించాలి. సిబ్బందిని చైతన్య పరచి, చిన్న చిన్న ప్రాథమిక చికిత్స చేసేలా అవగాహన కల్పించాలి.

Related Posts