రాజకీయాల్లో నేతలు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు వారికి ఎంత యాంటీగా మారతాయో.. ఎప్పుడు ఎలాంటి పరిస్థితు లు సృష్టిస్తాయో చెప్పడం చాలా కష్టం. ప్రజల్లో బలమైన శక్తిగా ఉండి కూడా కొద్దిపాటి సంయమనం, కొంత ఆలోచన లేకపోతే.. రాజకీయంగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలో కూడా కడపకు చెందిన సీనియర్ పొలిటీషియన్.. అన్నయ్యగారి సాయిప్రతాప్‌ను చూస్తే.. ఇట్టే అర్ధమవుతుంది. ఆయన రాజకీయాల్లోచాలా సీనియర్. వరుస పెట్టి గెలిచిన సత్తా.. ఆయన సొంతం. ప్రముఖ పారిశ్రామిక వేత్తగా గుర్తింపు పొందిన సాయి ప్రతాప్ కడప కేంద్రంగా రాజకీయాలు చేశారు. వైఎస్ అనుచరుడిగా ఆయన ఎనలేని గుర్తింపు పొందారు. కడప జిల్లా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో కంచుకోటను ఏర్పాటు చేసుకున్నారు.ఆయన ఎన్నికల్లో నామినేషన్ వేస్తే.. ఓటమి అనేది తెలియకుండా గెలిచిన పరిస్థితి ఉంది. 1989 నుంచి 1999 వరకు వరుసగా ఇక్కడ నుంచి ఎంపీగా ఆయన విజయం సాధించారు. అదేవిధంగా 2004, 2009 ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు. ప్రతిసారి ఆయన కాంగ్రెస్ టికెట్‌పైనే గెలుపు గుర్రం ఎక్కారు. అయితే, 2014లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలోనూ ఆయన తనగళం వినిపించారు. ఈ క్రమంలోనే అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌కు అండగా కూడా నిలబడ్డారు. 2014 ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్‌ను బయటకు వచ్చి వేసిన అడుగు రాజకీయంగా ఆయనకు దెబ్బకొట్టింది. అప్పట్లో కిరణ్ కుమార్ స్థాపించిన సమైక్యాంధ్ర పార్టీకి జైకొట్టారు. కిరణ్ కు చేరువయ్యారు. ఈ క్రమంలోనే పార్టీలో ఉపాధ్యక్ష పదవిని సైతం పొందారు.అయితే, అనుకున్నది ఒక్కటి.. జరిగింది మరొక్కటి! అన్నట్టుగా ఆయన వేసిన అడుగులు విఫలమయ్యాయి. సమైక్యాం ధ్ర పార్టీని ప్రజలు రిసీవ్ చేసుకోలేదు. దీంతో అనూహ్యంగా ఆయన యూటర్న్ తీసుకుని టీడీపీలోకి చేరిపోయారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తన కంచుకోట అయిన రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకు న్నారు. అయితే, రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి.. నల్లారి కిరణ్ సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ ఎంట్రీతో సాయిప్రతాప్ జాతకం కూడా కుదుపులకు లోనైందని అంటున్నారు అనుచరులు. సాయిప్రతాప్ టీడీపీలో చేరినప్పుడు చంద్రబాబు నుంచి ఆయనకు అద్భుతమైన స్వాగతం పలికారు. అయితే అదంతా గతం అన్నట్టుగా ఉంది సాయి పరిస్థితి.వచ్చే ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ ఎంపీగా నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి కుమారుడు పోటీ చేయాలనినిర్ణయించుకున్నారని, దీనికి చంద్రబాబు సైతం పచ్చజెండా ఊపారని తాజాగా తెరమీదికి వచ్చిన సమాచారం బట్టి తెలుస్తోంది. దీంతో సాయిప్రతాప్ ఆశలు ఆవిరయ్యాయని అంటున్నారు అనుచరులు. మరి ఎన్నికల సమయానికి ఈ పరిస్థితి ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.