టీడీపీకి అత్యంత కీలకమైన అనంతపురం జిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి తన పట్టును నిలుపుకొనేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యం గా వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడం నిమగ్నమైన జేసీ.. పార్టీ అధినేత చంద్రబాబును మంచి చేసుకోవడంలో తనకున్న అన్ని ఛానెళ్లను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీని నిర్వీర్యం చేయాలన్న చంద్రబాబు సూచనలతో ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అబ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓటమి పాలైన గుర్నాథరెడ్డిని జేసీ టీడీపీలోకి తీసుకు వచ్చారు. ఫలితంగా ఇక్కడ వైసీపీకి సరైన అభ్యర్థి కూడా కరవయ్యారు.తన మాటలతో టీడీపీ తీర్థం పుచ్చుకున్న గుర్నాథరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించుకునేందుకు కూడా జేసీ రంగంలోకి దిగారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారితీసింది. అనంతలో టీడీపీ సిట్టింగులకు మంచి పేరుంది. వారు కొన్నేళ్లగా పార్టీకి సేవలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఎవరిని కదిలించి టికెట్ లాక్కుని గుర్నాథరెడ్డికి ఇచ్చినా పార్టీకి ఇబ్బందికర పరిణామమే. అయితే, దీనిని ముందుగానే గుర్తించిన జేసీ.. అనంత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నాడు. రోడ్ల విస్తరణ మొదలుకుని, ప్రతి విషయంలో ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభాకర్ చౌదరికి రాజకీయంగా కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకొంటానని ప్రభాకర్ చౌదరి ఇప్పటికే చెప్పేశారు. దీనికి జేసీ కూడా ఆయనకి సీటు వద్దు అంటున్నారు. ఒకవేళ ఇచ్చినా.. చాపకింద నీరులా జేసీ మంత్రాంగంతో ప్రభాకర్‌కు పొగ పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ కాకపోయినా.. జేసీ కన్ను రాయదుర్గంపై పడింది. అక్కడ నుంచైనా గుర్నాథరెడ్డికి అవకాశం ఇప్పించుకోవాలని జేసీ బావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి గెలిచిన మంత్రి కాల్వ శ్రీనివాసులుకు ఎర్త్ పెట్టేలా పావులు కదుపుతున్నారు. మరి ఈ విషయంలో జేసీ పంతం ఎక్కడ నెగ్గుతుందో చూడాలి.ఇదిలావుంటే, వైసీపీ నుంచి గరునాథరెడ్డి టీడీపీలోకి రావడంతో జగన్ ముందుగా మైనార్టీ నేత నదీమ్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే, ఇక్కడ ఆయన సరిపోరని అనుకున్నారో.. లేక హిందూపురంలో అయితే కరెక్ట్ అనుకున్నారో తెలియదు కానీ.. వెంటనే ఆయన్ను హిందూపురం ఎంపీ సీటు సమన్వయకర్తగా వేసి మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి అనంత అసెంబ్లీ బాధ్యతలు అప్పగించారు. ఆయన టీడీపీ జేసీ దివాకర్‌రెడ్డికి సమీప బంధువే. మరి ఈయనకు ఇక్కడ అనుకూల పవనాలు వీస్తాయో లేదో చూడాలి. ఏదేమైనా.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనంతలో జేసీ రాజకీయాలు పెరిగాయని చెప్పకతప్పదు!