YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సాహిత్యం

సాహితీ దిగ్గజం " దీక్షితులు గారు "  ఇక లేరు

సాహితీ దిగ్గజం " దీక్షితులు గారు "  ఇక లేరు

- వాగ్దేవి వరపుత్రుడు  " దీక్షితులు గారు "  కన్నుమూత 

- " సంస్కృతీ కేంద్రం" దీక్షితులు గారి దివ్య స్మృతికి భాస్పాంజలి

ప్రఖ్యాత  సంస్కృతాంధ్ర పండితులు, రచయత, నాటక రచయత కొలచలమ యజ్ఞనారాయణ దీక్షితులు గారు శనివారం ఉదయం హైదరాబాద్ లో కన్ను మూశారు. ఆయనకు 93 ఏళ్ళు. వయో సంబంధ అనారోగ్యంతో ఆయన కొంత కాలంగా చికిత్సపొందుతున్నారు.
దీక్షితులు గారి భార్య శ్రీమతి మాణిక్యాంబ,  కుమారుడు సూర్యం కొలచలమ ప్రఖ్యాత అడ్వర్టైజింగ్ ఏజెన్సి " సూర్య ఏడ్ సిస్టం"  " యువ్ వెబ్ సైట్ " లకు అధినేత.  దీక్షితులు గారి కుమార్తెలు అన్నపూర్ణ, శ్రీ రంగ మణి, సత్యభామ మనుమడు నితిన్, మనవరాలు నిమిషా ఉన్నారు.  

 దీక్షితులు గారి మృతి సమాచారం అందుకున్న మీడియా, ప్రచార రంగ మిత్రులు వచ్చి ఆయన కుమారుడిని ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. వారిలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య ప్రజా సంభందాల అధికారి వనం జ్వాల నరసింహా రావు, సీఎనియర్ పాత్రికేయుడు ఆకిరి రామ కృష్ణా రావు,  భండారు శ్రీనివాస రావు ఉన్నారు. 

- సంస్కృతంలో రాసి 'అనార్కలి' రచనా చమత్కృతికి తార్కాణం..

సంస్కృతoలో అమేయ పాండిత్య ప్రకర్ష కలిగిన  దీక్షితులు గారు అనేక కావ్యాలు, నాటకాలు, నవలలు రాసి ప్రసిద్ధికెక్కారు. మొఘల్ యువరాజు సలీం నిరుపేద సౌదర్య రాశి  అనార్కలి మధ్య నడచిన చారిత్రక ప్రణయ గాధను సంస్కృతంలో రాసి మెప్పించడం ఆయన రచనా చమత్కృతికి తార్కాణం. అరబ్బీ మాతృకగా, ఇస్లాం సంప్రదాయాల నేపధ్యం ఇతివృత్తంగా సాగిన ఆ ప్రేమకావ్యాన్ని అందుకు పూర్తి భిన్నమైన సంస్కృతంలో రాసి మెప్పించి జాతీయ స్థాయిలో సాహితీ విమర్శకుల మన్ననలు పొందారు. అల్లసాని పెద్దన్న విరచితమైన  మనుచరిత్రలోని వరూధని ప్రవరాఖ్యుల శృంగార ప్రహసనాన్ని   "వరూధని" సంస్కృత నాటకంగా సృజియించి వెన్నోళ్ళ ప్రశంసలు అందుకున్నారు.   

అలరించిన "లవంగి"

 చక్రవర్తికి నర్తకి కి మధ్య సాగిన  కథాంశo ఆధారంగా ఆయన రాసిన  "లవంగి"  కూడా  మన సాహితీ ప్రియులను అలరించిన గొప్ప రచన. ఆ నాటకం ఆధారంగా దూరదర్శన్ నేషనల్ నెట్ వర్క్ పై  తొలి సంస్కృత టెలిఫిలిం గా  దేశవ్యాప్తంగా  ప్రసారమై మంచి  స్పందనను పొందింది. అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ నుంచి సైతం ప్రశంసలు పొందిన గొప్ప అనుభవం లవంగి నాటకం ద్వారా దీక్షితులు గారు పొందారు.  

- మన్ననలు పొందిన "సత్యభామ"
 ఆయన తెలుగులో రాసిన ఏకైక నవల "సత్యభామ" కూడా పాటకుల మన్ననలు పొందింది. సంస్కృతం పై ఉన్న అవ్యాజమైన అభిమానంతో కాబోలు ఆయన తెలుగులో ఎక్కువ రచనలు చేయక పోవడం వల్ల ఈ తరం సాహితీ అభిమానులు  ఆయన సృజనను అనుభవించి పలవరించే అవకాశం పొందలేక పోయారు. 
గుంటూరు, పట్టాభిపురం  వాస్తవ్యులైన యజ్ఞ నారాయణ దీక్షితులు గారు జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆచార్య దివాకర్ల వెంకటావధాని, పిల్లలమఱ్ఱి హనుమంత రావు, పురాణం సుభ్రహ్మణ్య శర్మ వంటి సాహితీ దిగ్గజాల సహవాసి. నిత్యం సాహితీ చర్చలతో తరించిన సహచరులు వారు. 

-  " సంస్కృతీ కేంద్రం" 
రచనల్లో , ఉత్తమాభిరుచి కనబరిచే దేక్షితులు గారు సంస్కృతీ ప్రియులు కూడా. గుంటూరు లో షుమారు అర్థ శతాబ్దానికి పూర్వమే ఆయన " సంస్కృతీ కేంద్రం" అనే సంస్థను స్థాపించి మంగళంపల్లి బాల మురళీ కృష్ణ, యామిని కృష్ణ మూర్తి, యడవలి రమ, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, పురాణం పురుషోత్తమ శాస్త్రి, నేతి రామస్వామి, ఆచంట వెంకట రత్నం నాయుడు, పీసపాటి, అబ్బూరి వర ప్రసాద రావు, నేరెళ్ళ వేణుమాధవ్  వంటి దిగ్గజాల ప్రదర్శనలను విజయవంతంగా నిర్వహించిన సారస్వత ప్రియులు ఆయన.

- తెలుగు లలిత గీతా ల్లోనూ ..
అలతి అలతి పదాలతో అనేక తెలుగు లలిత గీతాను దీక్షితులు గారు రాశారు. మనో , వేదవతి ప్రభాకర్ వంటి ప్రముఖ గాయని,గాయకులూ వాటిని ఆలపించారు. వాటిలో  మేలిమి తరకల్లాంటి గీతాలను క్యాసేట్లుగా వెలువరించారు .
తన ప్రతిభాపాటవాలతో ఎన్నో రసమయ కావ్యాలను వాగ్దేవికి నైవేద్యంగా సమర్పించి, మన సాహిత్య చరిత్రను సుసంపన్నం చేసిన వాగ్దేవి వరపుత్రుడు దీక్షితులు గారి దివ్య స్మృతికి భాస్పాంజలి సమర్పిస్తున్నాము..

Related Posts