ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం అప్పజెప్పిన పనులను ఒక్కొక్కటి పూర్తి చేస్తోంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల పెంపు, అవసరం లేనిచోట కుదింపు, ప్రాంతాల మార్పు వంటి ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు, ఓటర్ల ఫోటోలతో కూడిన ముసాయిదాను వెలువరించనున్నారు. జిల్లాలో ప్రస్తుతం 12,23,554 మంది ఓటర్లు ఉన్నట్లుగా తేల్చిన యంత్రాంగం కొత్తగా మరో 82 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేస్తోంది.జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం 12,23,554 మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా ఓటు నమోదు కోసం జిల్లాలో 70,575 మంది దరఖాస్తు చేసుకోగా వారి వివరాలను పరిశీలించి అర్హులైన 45,474 మందికి కొత్తగా ఓటు హక్కు కల్పించారు. ఫోటో ఓటర్ల జాబితాను ఇవాళ సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లుగా ముందస్తు ఎన్నికలు డిసెంబర్‌లో జరిగితే శనివారం విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటుదక్కిన వారికి ఓటుహక్కును వినియోగించుకొనే అవకాశం ఉండదు. ఏప్రిల్‌లో జరిగితే మాత్రం కొత్త ఓటర్ల నమోదు, సవరణలు చేసుకున్నవారికి అవకాశం ఉంటుందని అధికారుల ద్వారా తెలుస్తోంది.జిల్లాలో గతంతో పోల్చితే ఈసారి పోలింగ్‌బూత్‌లు పెరగనున్నాయి. గ్రామీణ ప్రాంతంలో 1,200 మంది ఓటర్లు, పట్టణాల్లో 1,400 ఓటర్లకు ఒక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటివరకు 1,546 పోలింగ్ కేంద్రాలుండగా కొత్తగా 82 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇదివరకు ఉన్న 27 పోలింగ్ కేంద్రాల ప్రాంతాలను మార్చారు.