నిజామాబాద్ జిల్లాలో నీలి విప్లవానికి రంగం సిద్ధమైంది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసి జలవనరుల్లో కావాల్సినంత మేర నీరు వచ్చి చేరింది. దీంతో మూడో విడత చెరువుల్లో చేప పిల్లలను వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పంచాయతీల్లో ఉండే చెరువుల్లోనూ చేపపిల్లలను వేయాలని అధికారులు నిర్ణయించడం మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం నింపుతోంది. మత్స్య శాఖలో సిబ్బంది కొరతతో మత్స్యకారులు ఇబ్బందుల పాలవుతున్నారు. జిల్లా విభజన నేపథ్యంలో లక్షెట్టిపేటలో ఉన్న ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని ఎత్తివేసి హాజీపూర్ మండలం గుడిపేట వద్ద మత్స్యశాఖ ఏడీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం జిల్లా మత్స్యశాఖ అధికారితో పాటు ఇద్దరు ఫీల్డ్ అధికారులు, ఒక ఫిషర్ మెన్, ఒక వాచ్‌మెన్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్, క్లర్క్, డాటా ఎంట్రీఆపరేటర్ పోస్టులు ఒకటి చొప్పున, ఫిషర్ మేన్ పోస్టులు రెండు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో చేపల పెంపకానికి అనువుగా 707 నీటి వనరులు, మూడు కాలాలు నిండుకుండలా ఉంటూ చేపల పెంపకానికి అనువుగా ఎల్లంపల్లి జలాశయం ఉన్నందున జిల్లాకు మత్స్య అభివృద్ధి అధికారి పోస్టు, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ పోస్టు కేటాయిస్తే ఫలితం ఉంటుంది.జిల్లాలోని నీటి వనరులకు సరిపడా అంచనాలతో ప్రభుత్వానికి నివేదికలు పంపిన అధికారులు చేప పిల్లలు అందుబాటులో ఉండటంతో చెరువుల్లో చేపలు వదిలేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద కలిపి మొత్తం 707 నీటి వనరులు ఉండగా జీవనది గోదావరి మీద నిర్మించిన ఎల్లంపల్లి జలాశయం మత్స్య పరిశ్రమకు ఊతం కానుంది. జలాశయం నీరు జిల్లాలో ఎల్లంపల్లి నుంచి గూడెం వరకు దాదాపు 20 కిలోమీటర్ల మేర మూడు కాలాలు విస్తరించి ఉంటుంది. ఈ ఏడాది జిల్లాలో చేపలు పెంచేందుకు అనుకూలంగా ఉన్న 278 చెరువులను గుర్తించారు. వాటిలో మత్స్యశాఖ 113, పంచాయతీకి చెందినవి 165 ఉన్నాయి. జిల్లాలో నీటి వనరులు నిండినందున సకాలంలో చేప పిల్లలను వదిలితే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడు 16 లక్షల చేప పిల్లలను అదనంగా వదులుతున్నందున జిల్లాలో రూ.35 కోట్ల మేర ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.మత్స్యకారులు చేపలు పట్టేందుకు వీలుగా వలలు, పట్టిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలించి మార్కెటింగ్ చేయడానికి వీలుగా వాహనాలను రాయితీపై ప్రభుత్వం అందజేస్తోంది. ఇప్పటికే మత్స్యకారులకు 75 శాతం రాయితీపై 963 ద్విచక్ర వాహనాలు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 812 మందిని అర్హులుగా గుర్తించారు.
వాస్తవానికి ఈ ఏడాది భారీ వర్షాలు కురిసి జిల్లాలోని నీటి వనరులు పూర్తి స్థాయిలో నిండాయి. చెరువుల్లో చేప పిల్లలను వదలడంతో దిగుబడి బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం మత్స్య శాఖలో పోస్టులు మంజూరు చేస్తే మరింత ప్రయోజనం ఉంటుంది.