YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

2న తెలంగాణా మంత్రివర్గ సమావేశం వారం రోజుల జరుగుతున్న తర్జన భర్జనలకు తెర

2న తెలంగాణా మంత్రివర్గ సమావేశం  వారం రోజుల జరుగుతున్న తర్జన భర్జనలకు తెర

ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. గత వారం రోజులుగా జరుగుతున్న తర్జన భర్జనలకు ఈ సమావేశం తో తెరపడనుంది. మంత్రివర్గ సమావేశంలోనే శాసనసభ రద్దుకు నిర్ణయం తీసుకొని, అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభకు వెళ్లి ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉందని తెరాస వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రివర్గ భేటీని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. అదే రోజు సాయంత్రం ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహణకు అధికార తెరాస సన్నద్ధమైన పరిస్థితుల్లో అంతకు కొద్ది సమయం ముందు జరిగే మంత్రివర్గ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.  ఆదివారం జరగబోయే రాష్ట్ర కేబినెట్‌ భేటీలో  కీలక నిర్ణయాలు వెలువడవచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఈ మంత్రివర్గ సమావేశంలో వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకొని సభ తర్వాత మరోసారి రద్దు కోసం మంత్రివర్గ భేటీ నిర్వహించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. పింఛను మొత్తం పెంపు, ఉద్యోగులకు మధ్యంతర భృతి తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి మొదట మంత్రివర్గ సమావేశం జరుగుతుందని, తర్వాత కేవలం శాసనసభ రద్దు కోసమే ఇంకోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తారని, మొత్తమ్మీద 10వ తేదీలోగా శాసనసభ రద్దు ప్రక్రియ పూర్తవుతుందని కొన్నిరోజులుగా ప్రచారంలో ఉంది. ముఖ్యమంత్రి, మంత్రులు సభపైన పూర్తిగా దృష్టి కేంద్రీకరించినందున రెండో తేదీ తర్వాతే మంత్రివర్గ భేటీ నిర్వహిస్తారని రెండు, మూడు రోజులుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రెండో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకొన్నారు. అధికారుల బదిలీలు పూర్త్షి ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తగ్గట్లుగానే అధికారుల బదిలీలు పూర్తి స్థాయిలో జరిగాయి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఇతర జిల్లా స్థాయి అధికారుల బదిలీలు కూడా పూర్తయ్యాయి. వివిధ వర్గాల సంక్షేమం, ఉద్యోగులకు సంబంధించిన నిర్ణయాలను మంత్రివర్గం తీసుకోవాల్సి ఉంది. రెండో తేదీ జరిగే సమావేశంలో వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు శాసనసభ రద్దుకు కూడా సిఫార్సు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సభ రద్దుకు నిర్ణయం తీసుకొని అదే రోజు బహిరంగ సభలో.. తమ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల నిర్మాణం, విపక్షాల రాజకీయాలు, ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తీసుకొన్న నిర్ణయాన్ని వివరించి మళ్లీ ఎన్నుకోవాలని పిలుపిచ్చే అవకాశం ఉందని తెరాస వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే విధానపరమైన నిర్ణయాలు తీసుకొన్న రోజునే అసెంబ్లీ రద్దుకు నిర్ణయం తీసుకొంటారా లేదా మరోసారి దీనిపై భేటీ అవుతారా అన్నదానిపై స్పష్టత రావలసి ఉంది.

Related Posts