- జగన్ కు కలిసొస్తున్న అదృష్టం
- పాదయాత్రలో ప్రజాదరణ
వైసిపి అధికారంలోకి రాదనీ, జగన్ కు ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత లేదని ఎంతమంది పగటికలలు కంటున్నప్పటికీ, అవినీతితో పుచ్చిపోయిన చంద్రబాబు జీవితపర్యంతం ముఖమంత్రిగా కొనసాగాలని కోటి ఆశలతో ఉన్నప్పటికీ, జగన్ కు మాత్రం ఉత్సాహాన్ని కలిగిస్తూ ఇటీవల అనేక అంశాలు అయాచితవరం లా కలిసివస్తున్నాయి. ఆ ప్రేరణతో జగన్ గత కొద్దిరోజులుగా తన దూకుడును రోజురోజుకు పెంచుతున్నారు.
ముఖ్యంగా జనసేనను భజనసేనగా మార్చి, చంద్రబాబు ఇచ్చే పాకేజీలకు ఆశపడి.. అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మెరుపుదాడి చేస్తూ రెండురోజులు ఒంటరిపక్షిలా పర్యటిస్తూ, మళ్ళీ మూడునెలలు ఇంట్లో ముడుచుకుని పడుకునే ఆత్మహత్యాసదృశ రాజకీయాలను చేస్తున్న జనసేన ప్రభావం పూర్తిగా తగ్గిపోవడం జగన్ కు పెద్ద ఊరట ఇచ్చే అంశమే. పవన్ లో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, పైగా అతనికి రాజకీయ అవగాహన శూన్యమని ప్రజలకే కాక జనసేన అభిమానులకు కూడా మొన్నటి పవన్ పర్యటనలో బాగా అర్ధమైపోయింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను స్తుతిస్తూ, ప్రతిపక్షాన్ని విమర్శిస్తూ, బలమున్న చోటనే పోటీ చేస్తాము అని పవన్ చేసిన ప్రసంగాలతో జనసేన అభిమానుల్లో నీరసం ఆవహించింది. జనసేనకు ఎక్కడ బలముందో ఎవరికి తెలుసు? దీంతో రాష్ట్రం మొత్తం తనకు బలం లేదని పవన్ అంగీకరించినట్లయింది. దీన్నిబట్టి చూస్తే చంద్రబాబుకు పాదదాసుడుగా ఉంటూ ఆయన ఇచ్చే పాకేజీలు తీసుకుంటూ మమ్మల్ని ముంచేస్తారేమో అన్న భయం అభిమానుల్లో ఆవరించింది. ఈ సంగతి గ్రహించే కాబోలు... పాండవ వనవాసం సినిమాలో "ధిక్..బానిసలు... బానిసలకింత అహంభావమా?" అని ఎస్వీ రంగారావు...ఎన్టీఆర్ ను తీసి అవతల పారేసినట్లు...."జనసేనే కాదు... ఎన్ని సేనలు వచ్చినా ఏమీ చెయ్యలేరు" అని పవన్ ను కేశఖండాన్ని చెత్తబుట్టలో పారేసినట్లు పారేసి జనసేనను మరుగుజ్జును చేసి పారేసాడు జగన్. వైసిపి ఎవ్వరికి భయపడదని చెప్పడం ద్వారా అభిమానుల్లో ఉత్సాహం అధికం చేసాడు.
ఇక మరో ముఖ్యమైన పరిణామం ఏమిటంటే... చంద్రబాబు లక్షలకోట్ల రూపాయలు దోచుకున్నారని ఇంతవరకూ జగన్ నెత్తి నోరు బాదుకుంటున్నా దానికి ప్రచారం కానీ, ప్రాముఖ్యత కానీ లభించడం లేదు. ఎందుకంటే జగన్, చంద్రబాబులది పాము-ముంగిస లాంటి సహజశత్రుత్వం కాబట్టి. కానీ, నిన్న బీజేపీ ప్రముఖులు సోము వీర్రాజు ...రెండు ఎకరాల ఆస్తిపరుడు చంద్రబాబుకు లక్షలకోట్ల ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయి? అని బహిరంగంగా విమర్శించడం జగన్ ఆరోపణలకు వెయ్యి ఏనుగుల బలాన్ని అందించాయి. బీజేపీ తెలుగుదేశం పార్టీలు మిత్రపక్షాలు కావడంతో ఈ ఆరోపణలకు మరింత విశ్వసనీయతను కలిగించాయి. అంటే... చంద్రబాబు మీద ఆరోపణలను బీజేపీ అగ్రనాయకత్వం నమ్ముతున్నదని, సమయం వచ్చినపుడు విచారణ జరుగుతుందని మోడీ-అమిత్ షా ల మనోభిప్రాయాన్ని వీర్రాజు హెచ్చరిక తెలియజేస్తున్నది. సోము వీర్రాజు ప్రకటనతోనే చంద్రబాబు తోకముడిచారనేది తేటతెల్లం. ప్రస్తుతం మిత్రధర్మాన్ని పాటిస్తూ చంద్రబాబు అవినీతిని బీజేపీ సహిస్తున్నది. చంద్రబాబు అవినీతికి ఎంతగా పాల్పడితే ఆయన జుట్టు బీజేపీ హస్తాల్లో అంతగా బిగుసుకుని పోతుంది. బీజేపీకి కావలసింది కూడా అదే. సహజంగానే ఈ పరిణామం జగన్ లో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది. అందుకే జగన్ మోములో చిరునవ్వులు ఎక్కువ అవుతున్నాయి.
ఇక పాదయాత్రలో ప్రజాదరణ కూడా అంతకంతకూ పెరుగుతున్నది కానీ, ఏమాత్రం తగ్గుతున్న సూచన కనిపించడం లేదు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదనే వాస్తవం జగన్ పాదయాత్రలో జనావళికి తెలిసిపోతున్నది. దానికి తోడు ఇన్నాళ్లూ ఎల్లో మీడియా గా చంద్రబాబుకు చెక్క భజన చేస్తూ ప్రజలను వంచిస్తున్న మీడియా వైఖరిలో కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయి. విశాఖలో ఉన్న ఐటి కంపెనీలే సరైన వ్యాపారం లేక, ప్రభుత్వ ప్రోత్సాహం లేక మూతబడుతున్నాయని, వందల ఎకరాల స్థలాలు ఇస్తున్నప్పటికీ కంపెనీలు రావడానికి ఆసక్తి చూపించడం లేదని, . ఇంకా కొత్త కంపెనీలు ఎలా వస్తాయని, విశాఖను ఐటి హబ్ గా ఎలా మారుస్తారని ...ఐటి మంత్రి లోకేష్ ను చూపిస్తూ ఈరోజు ఉదయం ఓ టీవీ ఛానల్ ఒక కధనాన్ని ప్రసారం చెయ్యడం విశేషం. ఏమైనప్పటికీ, జగన్ కు రానున్నవి శుభదినాలే. పాదయాత్ర జగన్ కు ఫలసిద్ధిని కలిగించబోతున్నది. ఇటు సూర్యుడు అటు పొడిచినా, ఇదే వాస్తవం.