శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించింది టిటిడి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. గోగర్భం డ్యామ్ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సం నిర్వహించారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 8 నుండి 10 గంటల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేపడతారు. కాగా, సెప్టెంబరు 4న మంగళవారం తిరుమలలో సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహిస్తారు. శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఈ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారు. ఈ కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.