ఏపీలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎంచుకున్న రాజకీయ రూటు ఆయనకే రివర్స్ కాబోతుందా ? వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్న జగన్ వేస్తోన్న ఎత్తులు, వ్యూహాలు తిరిగి రివర్స్‌లో వైసీపీకే డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయా అంటే ? తాజా రాజకీయ పరిణామాలు అవుననే అంటున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ పార్టీని వీడి… వైసీపీ పార్టీని స్థాపించిన జగన్‌కు రాజశేఖర్‌రెడ్డికి నమ్మకం విషయంలో చాలా తేడా ఉందని వైసీపీలోనే పలువురు సీనియర్ నాయకులు చెబుతున్నారు. వైఎస్‌ను ఎవరైనా నమ్ముకుంటే వాళ్ల రాజకీయ భవిషత్తుపై పక్కాగా హామీ వచ్చేసినట్లే అన్న నానుడి ఉండేది.ఎంతో మంది సామాన్య కార్యకర్తలు వైఎస్ అండతో ఉన్నత స్థాయి నాయకులుగా ఎదిగారు. ఎమ్మెల్యేలుగా ఉన్నవారు మంత్రులు అయ్యారు. సామాన్య కార్యకర్తలుగా ఉన్న పలువురు నాయకులను ఎమ్మెల్యేలుగా చేసి వాళ్లు ఊహించని భవిషత్తును ఇచ్చిన ఘనత వైఎస్‌దే. 2009లో మైలవరం సీటు ఆశించి భంగపడ్డ జోగి రమేష్‌ను చివర్లో పెడనకు పంపి ఎమ్మెల్యే చేసిన ఘనత వైఎస్‌దే. అలాగే ఎవ్వరూ ఊహించని విధంగా వైఎస్‌నే నమ్ముకున్న గుంటూరు జిల్లాకు చెందిన కూచిపూడి సాంబశివరావును జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా, ఆయన భార్య విజయను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చేశారు. మల్లాది విష్ణును ఎమ్మెల్యే చేశారు. ఇవి వైఎస్‌ను నమ్ముకుంటే ఎంత ఉన్నత స్థానాలకు తీసుకు వెళతారో ? చెప్పేందుకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు. వైఎస్ జగన్ విషయంలో ఇందుకు పూర్తి రివర్స్‌లో జరుగుతోంది. జగన్‌ను ఎంతో నమ్మిన నాయకులకు ఆయన న్యాయం చేయడం లేదన్న విమర్శలు పార్టీలోనే విన్పిస్తున్నాయి. ఒక జంగా కృష్ణమూర్తి, ఒక పిల్లి సుభాష్ చంద్రబోస్, మర్రి రాజశేఖర్ వీళ్లంతా వైఎస్ టైం లో ఒక వెలుగు వెలిగిన నాయకులు. తమకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసుడు స్థాపించిన పార్టీలోకి మంచి స్థానాలను వదులుకుని వచ్చిన వీళ్లకు జగన్ చుక్కలు చూపుతున్నాడు. విశాఖ జిల్లా యలమంచలి నియోజకవర్గానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పెండెం దొరబాబుది కూడా అదే పరిస్థితి. కేవలం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విలువలను నమ్ముకుని తనను నమ్ముకున్న వాళ్లతో రాజకీయం చేస్తే, జగన్ తనని నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతూ ధన రాజకీయం చేస్తున్నాడని విమర్శలు తీవ్రంగా వ్యక్తం అవుతున్నాయి.తనను నమ్ముకుని పార్టీ కోసం కోట్లాది రూపాయులు ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నవారిని ధన ఇతరత్రా కారణాలు సాకుగా చూపించి నిర్ధాక్షిణ్యంగా తప్పించేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో సామాన్య కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమౌతుంది. ప్రజాక్షేత్రంలో బలం లేని వ్యక్తులను, డబ్బు సాకుగా చూపి టిక్కెట్లు ఇస్తే రేపు జగన్ సీఎం అవ్వడం కలేనా ? అన్నది సగటు వైసీపీ అభిమానిని వేధిస్తోన్న ప్రశ్న. ప్రజాక్షేత్రంలో బలం లేని విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు చెబుతున్న మాటలను నమ్మి జగన్ తనను నమ్ముకున్న వాళ్లను తప్పించేయడం ఏ మాత్రం సమంజసంగా లేదన్నది పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతున్న అభిప్రాయం. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికలనాటికి వైసీపీలో అంతర్గత కలహాలు పెరిగి పార్టీ బలహీన పడే ప్రమాదం ఉంది