YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక రాజకీయాల్లో కొత్త ట్విస్ట్

కర్ణాటక రాజకీయాల్లో కొత్త ట్విస్ట్
ఇక కష్టమే… నూరు రోజుల పాలన పండగ చేసుకున్న ఆనందం కూడా ఆవిరై పోయింది. సిద్ధరామయ్య నుంచి ముప్పు ఉందని ఇన్నాళ్లూ భావించిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సిద్ధరామయ్యేకాదు…కాంగ్రెస్ లో ఎవరైనా కొంపముంచుతారన్నది అర్థమయిపోయింది. సిద్ధరామయ్య నిన్న మొన్నటి వరకూ చేసిన వ్యాఖ్యలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అయితే ఇప్పుడు సిద్ధూ కొంత సర్దు కున్నారు. కాని సిద్ధూ అనుచరులు మాత్రం ససేమిరా అంటున్నట్లుంది. తాజాగా బెళగావి కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఎంతవరకూ అంటే పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోతామని ఏకంగా కాంగ్రెస్ అగ్రనేతల ఎదుటే వార్నింగ్ ఇవ్వడం వరకూ. బెళగావి జిల్లాలో సతీష్ జార్ఖిహోళి, రమేష్ జార్ఖిహోళి బ్రదర్స్. వీరద్దరిలో రమేష్ జార్ఖి హోళి ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మంత్రి అయ్యారు.రాహుల్ ను కలసి వచ్చి నాలుగురోజులు గడవకముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోతామని వార్నింగ్ ఇవ్వడం కుమారస్వామిని ఆలోచనలో పడేసింది. దీనివెనక సిద్ధరామయ్య ఉన్నారా? అన్నఅనుమానాలు తలెత్తినా అది జిల్లా నేతల మధ్య తలెత్తిన విభేదాలని అర్థమయింది. ఈ పంచాయతీ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరకూ వెళ్లడం గమనార్హం. ప్రస్తుతం కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. జిల్లాకు చెందిన మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ ల మధ్య విభేదాలు తలెత్తాయి. సహకార బ్యాంకు ఎన్నికల సందర్భంగా లక్ష్మీ హెబ్బాళ్కర్ నిబంధనలను ఉల్లంఘించారన్నది జార్ఖిహోళి సోదరుల ఆరోపణ. లక్ష్మీ హెబ్బాళ్కర్ కు కాంగ్రెైస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మద్దతు ఉంది. అంతేకాదు మంత్రి డీకే శివకుమార్ కూడా ఆమెకు వత్తాసు పలుకుతున్నారు.లింగాయత్ వర్గానికి చెందిన లక్ష్మి తమ అనుచరులందరిని తమ నుంచి వేరు చేస్తున్నారని రమేష్, సతీష్ లు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. అయితే అది పీక్ స్టేజీకి వెళ్లిపోయింది.అధిష్టానానికి ఫిర్యాదుచేసినా పట్టించకోవడం లేదనన్నది సతీష్ జార్ఖిహోళి, రమేష్ జార్ఖిహోళిల వాదన. దీనిపై కర్ణాటక ఇన్ ఛార్జి వేణుగోపాలరావు పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీలో కూడా అగ్రనేతలందరూ లక్ష్మికే మద్దతు పలకడంతో ఈ బ్రదర్స్ ఫైరయిపోయారు. ఇటీవలే ఈ బ్రదర్స్ కొందరు ఎమ్మెల్యేలతో కలసి అజ్మీర్ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు తాజాగా వీరి హెచ్చరికలతో కాంగ్రెస్ హైకమాండ్ హైఅలెర్ట్ అయింది. వీరిద్దరూ సిద్ధరామయ్యకు అనుచరులు కావడంతో వారికి నచ్చజెప్పే బాధ్యతను ఆయనకే అప్పగించారు. సిద్ధరామయ్య వీరితో మాట్లాడి శాంతింప చేశారంటున్నారు. అయితే యూరప్ పర్యటనకు బయలుదేరుతున్న సిద్ధరామయ్య ఆయన వచ్చేలోగా ఈ బ్రదర్స్ అనుకున్నంత పనిచేస్తారా? అన్న అనుమానం లేకపోలేదు. సిద్ధరామయ్య దాదాపు పది రోజుల పాటు యూరప్ వెళతారు. ఈలోపు కర్ణాటక రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చంటున్నారు.

Related Posts