YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

ఉన్నతంగా సేవా స్ఫూర్తి ఆమె సొంతం

ఉన్నతంగా సేవా స్ఫూర్తి ఆమె సొంతం

కోటిశ్వరుల కుటుంబం అనగానే ఆడవాళ్లు ఇంటికి పరిమితమయ్యేవారే ఎక్కువ. కానీ ఆమె కోట్లకంటే ఎక్కువగా తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నారు. పెద్దింటి కోడలైనా అహంకారాన్ని దరిచేరనివ్వలేదు. తనేం సాధించినా,ఎంత కీర్తిని ఆర్జిస్తున్నా... పెళ్ళికి ముందునాటి అమ్మాయిగానే ఉన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన తను ఎదిగి వచ్చిన నడిచివచ్చిన దారినీ మరిచిపోలేదు. ఉన్నదాంట్లో సంతృప్తి చెందడమే కాకుండా నలుగురికి సాయం చేయాలనే మానవత్వాన్ని తనలో ఇముడ్చుకున్నారు. భర్తతో పాటు పలు వ్యాపారాల్లో  భాగస్వామిగా ఉంటూనే సామాజికసేవలోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పారిశ్రామిక రంగంలో రాణిస్తూ మహిళా వ్యాపారవేత్తగా ఫోర్బ్స్ జాబితాలో స్థానం సంపాదించారు. ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్‌తో సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తున్న భారతదేశ ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ సక్సెస్‌మంత్ర. నీతా అంబానీ! ముఖేశ్ అంబానీ భార్య. రిలయన్స్ సహ సారథి. ఇప్పుడు లేటెస్ట్‌గా మోస్ట్ పవర్‌ఫుల్ ఏషియన్ బిజినెస్ ఉమన్. ఫోర్బ్స్ ప్రతిసారి విడుదల చేసే ఈ లిస్ట్‌లో తొలిసారి నీతా పేరు కనిపించింది. లిస్ట్‌లో అందరికన్న పైన నీతా కనిపించారు. లిస్టులో నీతా చాలా దేశాలను బీట్ చేశారు. ఆయా దేశాలలోని మహిళా పారిశ్రామికవేత్తలందర్నీ వెనక్కి తోసి ఫోర్బ్స్ పరుగుల పందెంలో ముందుకు దూసుకువచ్చారు. నీతా గురించి ఫోర్బ్స్ వ్యాఖ్యానిస్తూ కోటీశ్వరుల భార్యలు.. వాళ్లెంత సమర్థులైనా.. భర్తల నీడగానే మిగిలిపోతారు. నీతా అలా కాదు. ఆమె సాధించిన విజయాలన్నీ వెరీ ఇంప్రెసివ్ అంది.

వ్యక్తిగత జీవితం

నీతా అంబానీ నవంబర్ 1, 1963లో ముంబాయిలో జన్మించారు. రవీంద్రబాయి దలాల్, పూర్ణీమా దలాల్ ఆమె తల్లిదండ్రులు. ఆమె నార్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకానమిక్స్‌లో తన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. అలాగే భరతనాట్యం నేర్చుకోవడంతో పాటు పలు ప్రదర్శనలు ఇచ్చారు. నీతా గుజరాతీ అమ్మాయి. ఆమె తల్లి జానపద నృత్యకళాకారిణి. నీతాకు ఎనిమిదేళ్ల వయసులో తల్లి దగ్గరే నృత్యప్రాశన జరిగింది. భరతనాట్య నర్తకిగా ఎదిగింది. దేశమంతా ప్రదర్శనలు ఇచ్చారు. ఓ రోజు ధీరూభాయ్ ముంబైలోని బిర్లా మాతోశ్రీ ఆడిటోరియంలో ఆమె డాన్స్ చూశారు. డాన్స్ బాగుంది. అమ్మాయి బాగుంది. ఎంత బాగుందీ అంటే.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకే అందం తెస్తోంది! ఆ అమ్మాయి ఎవరు? అని నిర్వాహకుడిని అడిగారు ధీరూభాయ్. ఆ కుటుంబం గురించి అందుబాటులో ఉన్న వివరాలన్నీ రాబట్టారు. ఆఖరికి ఫోన్ నెంబరు కూడా. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తన కుమారుడు ముఖేష్ అంబానీకి ఇచ్చి 1985 మార్చి 8న పెళ్లి చేశారు. అలా ఆమెను ధీరుబాయి తన ఇంటి కోడలుగా చేసుకున్నారు. నీతాముఖేష్‌లకు ముగ్గురు పిల్లలు ఈషా, ఆకాశ్, అనంత్ ఉన్నారు.
వ్యాపారంలోకి అడుగు.

ధీరుబాయి అంబానీ ఉన్నన్ని రోజులు వ్యాపారం ఆయనతో పాటు ఆయన కుమారులు అనిల్, ముఖేష్ చూసుకునేవారు. అయితే ఆయన మరణం తర్వాత అన్నదమ్ములిద్దరూ వ్యాపారాన్ని పంచుకోవడంతో భర్తకు చేదోడువాదోడుగా ఉండడం కోసం నీతా వ్యాపారంలోకి అడుగుపెట్టక తప్పలేదు. మామ మరణం తర్వాత ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్‌ను ప్రారంభించి దానికి అధ్యక్షురాలిగా ఉండడంతో పాటు పలు సేవాకార్యక్రమాల్లో భాగమవుతున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు విద్యనందించే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు అధ్యక్షురాలిగా, ముంబై ఇండియన్స్ సహాధ్యక్షురాలు, ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అదనపు డైరెక్టర్‌గా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి సహాభాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. వ్యాపారంలో రాణిస్తున్న వారిలో మోస్ట్ పవర్‌ఫుల్ ఏషియన్ బిజినెస్ ఉమన్‌గా పోర్బ్స్ గుర్తించింది. అలాగే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి తొలి భారతీయ మహిళా సభ్యురాలుగా ఉన్నారు.


రిలయన్స్ ఫౌండేషన్

నీతా రిలయన్స్ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాలు, దాతృత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం దీన్ని 2010లో నీతా ప్రారంభించారు. ఈ పౌండేషన్ విద్య, క్రీడలు, ఆరోగ్యం, గ్రామీణ పరివర్తన, పట్టణ పునరుద్దరణ, విపత్తు ప్రతిస్పందన, మహిళల సాధికారత, ప్రమోషన్ , భారతీయ సంస్కృతి పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. గతంలో గుజరాత్, చెన్నై, కశ్మీర్, కేథార్‌నాథ్, మారత్‌వాడ తదితర ప్రాంతాల్లో వచ్చిన ప్రకృతి వైపరీత్యల సందర్భంగా ఫౌండేషన్ సేవలందించింది.

ఉద్యోగులకు కాలనీ

కోటిశ్వరుడి భార్యగా ఉన్నప్పటికీ నీతాలో ఆ గర్వం కనపడదు. పైగా తన సేవానిరతితో అందరి అభిమానం అందుకుంటున్నారు.1997లో రిలయన్స్ మెగా-రిఫనరీలో పనిచేసే ఉద్యోగులకోసం జామ్‌నగర్‌లో కంపెనీ టౌన్‌షిప్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఒక పద్ధ్దతిలో మూడు లైన్లతో ఏకోఫ్రెండ్లీ కాలనీగా తీర్చిదిద్దారు. ఈ కాలనీలో 17000 ఇండ్లు నిర్మించారు. ప్రస్తుతం ఈ కాలనీ ఒక పండ్ల తోటగా రూపొందింది. ప్రస్తుతం ఇక్కడ లక్ష వరకు మామిడి పండ్ల మొక్కలు, పలు రకాల పక్షులు ఉన్నాయి.
ముంబై ఇండియన్..

నీతా అంబానీకి క్రీడలంటే అమితమైన ఆసక్తి. 2008లో రిలయన్స్ సంస్థ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టును కొనడానికి ప్రధాన కారణం కూడా ఆమే. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న సీజన్ వరకు దాదాపు జట్టు ఆడిన ప్రతి మ్యాచ్‌కూ ఆమె హాజరవుతూనే ఉన్నారు. ఐపీఎల్‌లో ప్రతి ఏడాదీ ముంబైలో జరిగే ఒక మ్యాచ్‌కు కచ్చితంగా అనాథపిల్లలను తీసుకొచ్చి మ్యాచ్ చూపిస్తుంటారు నీతా. వారికి రవాణా, ఆహారం అన్నీ ఉచితంగా అందిస్తారు. భారతదేశంలో క్రీడలంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదని, ఇతర క్రీడలను కూడా ప్రోత్సహిస్తుండాలని నీతా తరచుగా చెబుతుంటారు. ఇందులో భాగంగా పుట్టిందే ఇండియన్ సూపర్ లీగ్. ఈ ఫుట్‌బాల్ టోర్నమెంట్ భారతదేశంలో జరగడానికి ప్రధాన కారణం నీతా. కేవలం రెండేళ్లలోనే ఐఎస్‌ఎల్ ప్రపంచంలో మూడో పాపులర్ ఫుట్‌బాల్ లీగ్‌గా ఎదగడానికి ఆమె ప్రణాళికలే కారణం. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా యంగ్ చాంపియన్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి దేశవ్యాప్తంగా టాలెంట్ సెర్చ్ చేస్తున్నారు. అలాగే 2013 నుంచి జూనియర్ ఎన్‌బీఏ ప్రోగ్రామ్ పేరుతో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో బాస్కెట్‌బాల్‌లో నైపుణ్యం ఉన్న పిల్లలను వెలికి తీస్తున్నారు. ఈ సంస్థ ద్వారా ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ సుమారు 70 వేల మంది విద్యార్థుల్లో విద్య పట్ల అవగాహన కల్పించి స్కూల్‌కు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నది. క్రీడల్లో చేసిన సేవలకుగాను రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డు-2017 అందుకున్నారు.


ఐఓసీ సభ్యురాలు

జూన్3, 2016న నీతాతో పాటు మరో ఎనిమిది మంది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ కమిటీలో స్థానం సంపాదించిన తొలి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

ధీరుబాయి అంబానీ ఇంటర్‌నేషనల్ స్కూల్

ధీరుబాయి ఇంటనేషనల్ స్కూల్‌కు నీతా వ్యవస్థాపకులరాలిగా, చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఈ స్కూల్ దేశంలోనే అత్యుత్తమ పాఠశాలల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ విద్యను అందిస్తున్నారు. ఎన్‌డీటీవీ, హిందూస్తాన్ టైమ్స్ వంటి మీడియా సంస్థలు ఈ పాఠశాలను ఐదేళ్లుగా నాలుగు సార్లు ముంబాయిలోనే నంబర్‌వన్ స్కూల్‌గా అభివర్ణించాయి.

Related Posts