YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

జ్వరాలతో వణకుతున్న ఉత్తరాంధ్ర

 జ్వరాలతో వణకుతున్న ఉత్తరాంధ్ర
మలేరియా, డెంగీ జ్వరాలపై ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగం కదిలింది. ఉత్తరాంధ్రలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే 1196 డెంగీ, మలేరియా కేసులు నమోదవ్వడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు సత్వర చర్యలకు ఉపక్రమించారు. జ్వర మరణాలు చోటు చేసుకున్న, జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఆయా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పంచాయతీల స్థాయిలో నిల్వ నీటికి అవకాశమున్నచోట లార్వాను చంపేందుకు 40వేల గంబూజియా చేపలను వదిలేందుకు రంగం సిద్ధం చేశారు. ఇవి దోమల లార్వాలను ఆహారంగా తీసుకుంటాయి. మురికికుంటల్లో ఆయిల్‌ బంతులను వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాల వ్యర్థ ఆయిల్‌, రంపపుపొట్టు మిశ్రమాన్ని బంతుల మాదిరి తయారుచేసి మురికి కుంటల్లోకి వేస్తున్నారు. చమురుతెట్టు వల్ల దోమల ఉద్ధృతి తగ్గుతోంది. గతనెల 24 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 14 డెంగీ కేసులు నమోదైతే 13 విజయనగరం జిల్లాలోనే ఉండడం గమనార్హం. ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు, విశాఖ జిల్లాలో రెండు మలేరియా కేసులు నమోదయ్యాయి.విజయనగరం జిల్లా బలిజిపేట మండలంలోని చినవంతరం జ్వరాలతో వణుకుతోంది. గ్రామంలో సుమారు 50 ఇళ్లు ఉండగా ప్రతి ఇంటిలోనూ జ్వరపీడితుడు ఉన్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  సుమారు ఇరవై రోజులుగా గ్రామస్తులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో పైసా, పరకో ఇచ్చి ఆర్‌ఎంపీ వైద్యుడిచే ఇంటి వద్దే వైద్యం చేయించుకుంటున్నారు.విషయం వైద్యాధికారులకు తెలిసినప్పటికీ గ్రామాన్ని సందర్శించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న అతికొద్ది మంది మాత్రమే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు. ఒకే ఇంటిలో చిన్నారులు శ్రీలత, భార్గవి జ్వరాలతో మంచంపట్టారు. గ్రామంలో రక్షిత మంచినీటి పథకం లేకపోవడంతో ఉన్న ఒక్క బోరు నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. నీటి కలుషితం వల్లే జ్వరాలు ప్రబలి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఏఎన్‌ఎం గ్రామానికి వచ్చినప్పుడు ఏవో మాత్రలు ఇచ్చి వెళ్లిపోయిందని, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత వైద్యాధికారులు స్పందించి జ్వరాలు అదుపులోకి వచ్చేంతవరకు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మెంటాడ మండలంలో జ్వర మరణాలు ఆగడంలేదు. ఇప్పటికే ఆండ్ర గ్రామానికి చెందిన కునుకు అప్పలనాయుడు, పిట్టాడ గ్రామానికి చెందిన ఎరగడ సంధ్య, పోరాం గ్రామానికి చెందిన ఎ. వెంకటమణి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మెంటాడ గ్రామానికి చెందిన లగుడు నీలిమ అనే విద్యార్థిని జ్వరంబారిన పడి  మృతి చెందింది. వారం రోజుల కిందట నీలిమకు జ్వరం రావడంతో స్థానికంగా చికిత్స అందించారు. మూడు రోజుల కిందట విశాఖపట్నం పెద గంట్యాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికరి తరలించారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి డెంగీ లక్షణాలున్నాయని చెప్పి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. 

Related Posts