జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో గుంటూరు నగరానికి రానున్నారు. అమరావతి రోడ్ నుంచి ఆటోనగర్ వైపునకు వెళ్లే ఇన్నర్ రింగ్‌రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జిల్లా
కార్యాలయం ప్రారంభించేందుకు ఆయన రానున్నట్లు సమాచారం. కార్పోరేట్ స్టైల్లో నాలుగు అంతస్తుల పార్టీ కార్యాలయాన్ని ఇప్పటికే సిద్దం చేశారు. అధికారికంగా పవన్ కళ్యాణ్‌తో ప్రారంభోత్సవం చేయించిన తర్వాత విస్తృతంగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్నట్లు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెప్టెంబరులోనే ఈ కార్యక్రమం నిర్వహించాలని నాయకులు భావిస్తున్నారు. పవన్ హాజరయ్యే ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివస్తారని భావిస్తున్నారు.పార్టీ కార్యాలయం ప్రారంభించిన రోజే సుమారు 50 వేల మందితో నగరంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. అయితే వేదిక, తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. క్రమేపీ వివిధ రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించి జిల్లాలో తమ పార్టీని కూడా ఎన్నికల రణరంగానికి సిద్దం చేసే దిశగా జన సేనాని పవన్ కళ్యాణ్ పావుల కదుపుతున్నట్లు స్పష్టమౌతోంది.