YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రతిపక్ష నేతపై క్షుద్రపూజలు చేస్తారేమో’

ప్రతిపక్ష నేతపై క్షుద్రపూజలు చేస్తారేమో’

ఆంధ్రప్రదేశ్‌లో తాంత్రికపూజలు మరోసారి కలకలం రేపాయి. కర్నూలు జిల్లాలోని చెన్నపల్లి కోట బురుజు వద్ద బుధవారం తాంత్రిక పూజలు జరిగాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తాంత్రిక పూజలు జరిగాయని తెలిసింది. కాగా, ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులకు ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. కోట బురుజు వద్దకు ఇద్దరు పూజరులను తీసుకొచ్చిన అధికారులు తాంత్రిక పూజలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. కోట బురుజు వద్ద పెద్ద ఎత్తున నిమ్మకాయలు, ఇతర సామగ్రిని స్థానికులు గుర్తించారు.

కోటలో తాంత్రికపూజలపై స్పందించిన అధికారులు గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపినట్లు చెప్పారు. కోట మధ్య భాగంలో తవ్వి ఉండటంపై ప్రశ్నించగా.. 13 రోజులుగా కోటలో నిధుల కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు తవ్వకాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ జరిపిన తవ్వకాల్లో భారీ రాయి గుండ్లు, గుర్రం ఎముకలు, పూత పోసిన ఇటుకలు మాత్రమే దొరికాయని చెప్పారు. తవ్వకాల్లో భాగంగా కోట వెనుక భాగంలో ఉన్న బావిలోని నీటిని పూర్తిగా బయటకు తీసినట్లు వివరించారు.

కోటలో ఉన్న పాతాళగంగ నుంచి సొరంగమార్గం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. తవ్వకాల్లో పురోగతిని సాధించేందుకు హైదరాబాద్‌ నుంచి అత్యాధునిక పనిముట్లను తెప్పించినట్లు వెల్లడించారు. అయితే, వాటిని ఉపయోగించినా ఎలాంటి ఫలితం దక్కలేదని చెప్పారు.

ప్రతిపక్షం ఫైర్‌..
కోటలో తవ్వకాలపై జిల్లా కలెక్టర్‌ కూడా నీళ్లునములుతున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా రోజుకు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తూ గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న విజయవాడ దుర్గాదేవి గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించి తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను గుర్తు చేశారు.

ఇవన్నీ చూస్తుంటే.. రేపోమాపో ప్రతిపక్ష నేతపై ప్రభుత్వ పెద్దలు తాంత్రికపూజలు చేస్తారేమో అనిపిస్తుందంటూ భయాందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడినా పాల్పడొచ్చని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వినాశన కాలం దాపురించే ఇలాంటి పనులకు ఒడిగడుతోందని మండిపడ్డారు. తాంత్రికపూజలు చేస్తున్న ప్రభుత్వం పెద్దలు ఉనికి లేకుండా పోతారని అన్నారు.

అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి.. వాళ్లు తానా అంటే వీళ్లు తందానా అంటున్నారని విమర్శించారు. స్వయం ప్రతిపత్తితో పని చేయడం మానేశారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో తాంత్రికపూజలపై విచారణ జరిపిస్తారని చెప్పారు. తాంత్రికపూజలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

క్షుద్రపూజలు మూర్ఖత్వ చర్య
‘దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటివరకూ వాస్తు, జోతిష్యాలను ప్రోత్సహించిన ప్రభుత్వాలు క్షుద్రపూజల వరకూ వెళ్లడం హాస్యాస్పదం. ప్రజల్లోని మూఢ నమ్మకాలను తొలగించాల్సిన ప్రభుత్వాలు.. వాటిని ప్రోత్సహించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుంది.

ఏదో ఆశించి ఓ వ్యక్తిపై క్షుద్రపూజలు చేసి లాభపడినట్లు ఆధారాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. క్షుద్రపూజలు నిజమే అయితే ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై నెగ్గడానికి రాజకీయ నాయకులు కేవలం క్షుద్రపూజల కోసమే ఖర్చు చేస్తారు. తాంత్రికపూజలు, క్షుద్రపూజలు వంటి వాటిని ప్రభుత్వాలు సమర్ధిస్తే దేశాభివృద్ధి కుంటుపడుతుంది.’ - టీవీ రావు.. జనవిజ్ఞాన వేదిక

Related Posts