భారీ వర్షాలు, వరదలతో కుదేలైన కేరళకు మరో ప్రమాదం ఎదురైంది. ‘ర్యాట్ ఫీవర్’ ఆ రాష్ట్రాన్ని వణికిస్తోంది. కలుషిత నీటి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి వరదల ప్రభావంతో ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారి కారణంగా ఒక ఆగస్టు నెలలోనే 12 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఆరుగురు గత ఆరు రోజుల్లోనే మృతిచెందారు. ఆగస్టు 8 నుంచి శతాబ్దంలోనే కనీవిని ఎరుగని భయంకర వర్షాలు కేరళను కుదిపేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి రాష్ట్రంలో మొత్తం 372 ర్యాట్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 54 మంది ఈ వ్యాధి కారణంగానే మరణించినట్లు అనుమానిస్తున్నారు. వైద్య పరిభాషలో లెఫ్టోస్పిరోసిస్ అని పిలిచే వ్యాధిని ‘ర్యాట్ ఫీవర్’ అని కూడా అంటారు. బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే ఈ వ్యాధి కొత్తేం కాకపోయినా.. వరదల కారణంగా వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది జనవరి, జులై మధ్య కేరళలో ర్యాట్ ఫీవర్ కారణంగా 28 మంది బలయ్యారు. భయానక ర్యాట్ ఫీవర్.. కిడ్నీ, లీవర్, మెదడు తదితర శరీరంలోని ప్రధాన భాగాలపై ప్రభావం చూపుతుంది. వ్యాధి నిరోధక శక్తిపైనా ప్రభావం చూపుతుంది. వ్యాధి బారిన పడ్డ వ్యక్తుల ఒక్కో అవయవం దెబ్బతినడం వల్ల పరిస్థితి విషమించి మరణం సంభవిస్తుంది. వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో ర్యాట్ ఫీవర్ విజృంభిస్తుండటం కేరళవాసులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పునర్నిర్మాణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. కానీ, నేటికీ కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కేరళలో పరిస్థితులు చక్కదిద్దడానికి రూ. 30 కోట్లు అవసరమౌతాయని అంచనా. కేరళను ఆదుకునేందుకు ఎంతో మంది సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు విరాళాలు ఇచ్చారు. సామాన్యులు కూడా ముందుకు కదిలారు. ఇటీవల ఓ యాచకుడు కూడా రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తన వంతుగా రూ. 94 సాయం చేయడం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. జల విలయంలో చిక్కుకొని విలవిల్లాడిన కేరళలో ఏడాది పాటు అన్ని అధికారిక సంబురాలను రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ వర్షాలు, వరదల్లో 350కిపైగా ప్రజలు చనిపోగా.. వేల కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళతోపాటు అన్ని యూత్ ఫెస్టివల్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంబురాల కోసం అవసరమయ్యే భారీ మొత్తాన్ని వరద సహాయక చర్యలకు తరలించనున్నట్లు తెలిపింది. రూ.30 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు కేరళ ప్రభుత్వం అంచనా వేసింది. పరిస్థితి పూర్తిగా సమీక్షించిన తర్వాత అధికారిక సంబురాలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఏ ప్రభుత్వ శాఖ ఏడాది పాటు ఎలాంటి పండుగ నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.వీటి ద్వారా మిగిలిపోయిన నిధులను సీఎం రిలీఫ్ ఫండ్‌కు తరలించాలని స్పష్టంచేసింది. సోమవారం వరకు రిలీఫ్ ఫండ్‌కు రూ.1036 కోట్ల విరాళాలు వచ్చాయి. ప్రజల నుంచి మరిన్ని విరాళాలు సేకరించడానికి కేరళ మంత్రులు త్వరలోనే 14 దేశాల్లో పర్యటించనున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి.. వరద నుంచి బయటపడుతున్నా.. చాలా ప్రాంతాల్లో రోగాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే 71 మంది ఎలుకల కారణంగా వ్యాపిస్తున్న వ్యాధి బారిన పడ్డారు. వివిధ రోగాలతో ఆసుపత్రిలో చేరిన 13800 మంది చికిత్స పొందుతున్నారు.