ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహ, ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నాయి. దీంతో ఎన్నికలకు మందే రాష్ట్రంలో వేడి మొదలైంది. గత ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన స్థానాలపై దృష్టి సారించిన రెండు పార్టీలు.. ఆయా స్థానాలనే టార్గెట్ చేశాయి. దీంతో రాజకీయం రంజుగా మారింది. ఇదిలాఉండగా, ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. టీడీపీలో ఇమడలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన చాలా కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. సోదరుడి మరణం తర్వాత ఆ పార్టీకి గుడ్‌బై చెప్పాలని డిసైడ్ అయిపోయారు. అనుకున్నట్లుగానే కొద్దిరోజుల క్రితం టీడీపీకి గుడ్‌బై చెప్పిన ఆయన ఈ నెల 2న జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. దీంతో మూడు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. దీంతో వైసీపీ రాజకీయం ఆయన చుట్టూనే తిరుగుతోంది. అయితే, ఆయనకు ఏ నియోజకవర్గం కేటాయిస్తారో అన్న దానిపై మాత్రం స్పష్టత రాలేదు. మరోవైపు ఆనం చేరికతో ఆ పార్టీలో చిచ్చు రేగింది. ఆయన చేరికను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న పార్టీలోని ఓ ముఖ్యమైన ఓ వర్గం.. ఈ చేరిక కార్యక్రమానికి దూరంగా ఉంది. ఈ విషయంలో వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.ఆనం రామనారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెండు నియోజకవర్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ఆత్మకూరు కాగా, రెండోది వెంకటగిరి. ఆత్మకూరు నుంచి గత ఎన్నికల్లో మేకపాటి గౌతంరెడ్డి విజయం సాధించారు. అలాగే వెంటకగిరిని టీడీపీ దక్కించుకుంది. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఏ స్థానం కేటాయించినా వైసీపీలో చిచ్చే రేగే అవకాశం కనిపిస్తోంది. మేకపాటి వర్గానికి భయపడి ఆయనకు వెంకటగిరి కేటాయించాలని అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడి ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ కారణంగానే ఆనం చేరిక కార్యక్రమానికి ఆయనతో పాటు.. మొదటి నుంచీ ఆయన చేరికను వ్యతిరేకిస్తున్న మేకపాటి వర్గం గైర్హాజరైంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లుగానే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి, ఉదయగిరి ఇన్‌చార్జి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, వెంకటగిరి ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, గూడూరు ఇన్‌చార్జి మేరిగ మురళి, కోవూరు ఇన్‌చార్జి ప్రసన్నకుమార్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి హజరు కాలేదు. మరి, ఇంత వ్యతిరేకత నడుమ ఆనం ఎలా నెగ్గుకొస్తారో వేచి చూడాలి.