వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు విశాఖ జిల్లాలో ఆశించిన స్పందన లభిస్తున్నా అధినేత మాత్రం నేతల తీరుపై కినుక వహించారని తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి పార్టీకి హైప్ వచ్చింది. దీంతో అనేక మంది పార్టీలోచేరేందుకు ముందుకు వస్తున్నారు. నిన్న గాక మొన్న నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరినా జగన్ అంత ఉత్సాహంగా లేకపోవడానికి లోకల్ గా చేరికలు లేకపోవడమేనంటున్నారు. గత ఐదారు నెలల నుంచి పార్టీలో చేరికలతో క్యాడర్ లోనూ జోష్ నెలకొంది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఇతర పార్టీల నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు.విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ హ్యాపీగా లేరని చెబుతున్నారు. వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించి తొమ్మిది నెలలు దాటుతోంది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. పాదయాత్రకు జనం పోటెత్తుతున్నారు. అయినా జగన్ మాత్రం లీడర్లపై అసహనంతో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం చేరికలు లేకపోవడమేనంటున్నారు. జగన్ పాదయాత్ర విశాఖ జిల్లాలో ప్రారంభించిన నాటి నుంచి ఆ జిల్లా నేతలు ఎవరూ జగన్ పార్టీలోచేరలేదు. దీనికి గల కారణాలను ఆయన సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది విశాఖకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. తొలి నుంచి విశాఖ జిల్లా జగన్ కు అచ్చిరావడం లేదు. అక్కడ బలమైన నేతలు సబ్బం హరి, కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు లాంటి వాళ్లు పార్టీలో చేరినా తిరిగి వివిధ కారణాలతో పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇప్పుడు విశాఖ జిల్లాలో వైసీపీకి సరైన నాయకత్వం లేదు. దీంతో గతకొంత కాలంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్టీ పరిస్థితిపై దృష్టి సారించారు. అయినా నేతలెవ్వరూ ఇతర పార్టీల నుంచి వచ్చి చేరడానికి ఉత్సాహం చూపడం లేదు.జగన్ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించే ముందు అనకాపల్లి ఎంపీ అవంతీ శ్రీనివాసరావు వైసీపీలో చేరతారన్న వార్తలు వచ్చాయి. అలాగే మరికొందరు అధికార పార్టీ నేతలు కూడా ఫ్యాన్ పార్టీలోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ జగన్ పాదయాత్రలో విశాఖ జిల్లాకు చెందిన నేతలెవ్వరూ చేరకపోవడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు తప్పించి ఎవరూ ఇంతవరకూ పార్టీలోచేరకపోవడంపై జగన్ సీనియర్ నేతలను ఆరా తీశారట. విజయసాయిరెడ్డి ఎంతగా ప్రయత్నిస్తున్నా నేతలు ఎవరూ పార్టీలో చేరేందుకు ముందుకు రావడం లేదు. దీనికి జనసేన పార్టీ వైపు నేతలు చూస్తుండటమే కారణమంటున్నారు. దీంతో పాదయాత్ర సాదాసీదాగా జరుగుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద జగన్ కు మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్న విశాఖ జిల్లాలో సీన్ ఏమాత్రం మారలేదన్నది స్పష్టమవుతోందంటున్నారు.