భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునే విషయంలో మాజీ అమెరికా అధ్యక్షులు జార్జి డబ్ల్యు బుష్, బరాక్ ఒబామాల మాదిరిగా ట్రంప్ ఆసక్తి కనబరచడం లేదని, భారత్‌ను ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారని భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేసిన టిమ్ రోమెర్ అభిప్రాయపడ్డారు. ‘ఇరు దేశాల భవిష్యత్తు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది, కానీ భారత్‌తో సంబంధాల విషయంలో యునైటెడ్ స్టేట్స్ పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలి. సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు ప్రయత్నించాలి’ అని టిమ్ పేర్కొన్నారు. ఫారెన్ పాలసీ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఒపీనియన్ ఎడిటోరియల్‌లో టిమ్ ఈ విషయాన్ని వెల్లడించారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాతో సంబంధాలు బలపరుచుకునే విషయంలో ఆసక్తి చూపుతూనే ఉన్నారని, కానీ ట్రంప్ యంత్రాగమే నిర్లక్ష్యంగా ఉందని టిమ్ తెలిపారు. మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా అవగాహనతో ప్రవర్తించారని, సత్సంబంధాలు పెంచుకునేందుకే ప్రయత్నాలు చేశారని అన్నారు. పలు పట్టణాల్లో అక్కడి భారత సంతతి ప్రజలతో సమావేశమై మాట్లాడినట్లు టిమ్ చెప్పారు. ట్రంప్ యంత్రాంగం భారత్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు క్లిష్టంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు వైపుల నుంచి తగిన మద్దతుతో ముందుకెళ్తే రెండు దేశాలూ లాభపడతాయని తెలిపారు.రేపు దిల్లీలో అమెరికా, భారత్‌ల మధ్య కీలకమైన 2+2 చర్చలు జరగనున్న నేపథ్యంలో టిమ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇరు దేశాల మధ్య 2+2 చర్చలు జులై 6నే వాషింగ్టన్‌లో జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అమెరికా వాయిదా వేసింది. దీంతో చర్చలు రేపు జరగనున్నాయి. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో, డిఫెన్స్ సెక్రటరీ జిమ్ మాటిస్ దిల్లీకి రానున్నారు. వారితో భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమై చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఇదే తొలి 2+2 చర్చలు.