YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వర్షాకాల సమావేశాలకు పటిష్ట బందోబస్తు శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు

వర్షాకాల సమావేశాలకు పటిష్ట బందోబస్తు             శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు
వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను శాసనమండలి చైర్మన్ ఎం.డి.ఫరూక్ ఆదేశించారు. సమావేశాలు జరుగుతున్న రోజుల్లో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో పోలీసులు, అసెంబ్లీ భద్రతా సిబ్బందితో బుధవారం జరిగిన సమావేశంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇటీవల గుంటూరులో నారా హమారా...టీడీపీ హమారా సభలో కొందరు వ్యక్తులు సృష్టించిన గలాటాను ఆయన అధికారులకు వివరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కొందరు కుట్రలు పన్నుతున్నారన్నారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. అసెంబ్లీకి వేళ్లే ప్రధాన కూడళ్ల వద్దా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ఎవ్వరినీ నొప్పించొద్దు...
వర్షా కాల సమావేశాలు గురువారం నుంచి ఏడెనిమిది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముందని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అవసరమనుకుంటే మరికొన్ని రోజులు పొడిగించే అవకాశముందన్నారు. అసెంబ్లీకి వచ్చే ప్రజాప్రతినిధుల పట్ల గేట్ల వద్దే ఉండే పోలీసులు, భద్రతా సిబ్బంది మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. కొంతమంది అసెంబ్లీ సిబ్బందిని గేట్ వద్ద ఏర్పాటు చేస్తామని, వారితో సమన్వయం చేసుకోవాలన్నారు. అసెంబ్లీ చుట్టూ సీసీ కెమెరాల ఏర్పాటు చేసి, గట్టి నిఘా పెట్టాలన్నారు. విజిటర్లకు ఇచ్చే పాస్ లను క్షుణ్ణంగా పరిశీలించాకే లోపలి అనుమతించాలన్నారు. విజిటర్స్ గ్యాలరీపైనా కన్నేసి ఉంచాలన్నారు. ఇప్పటికే మీడియాకు పాస్ లు ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ, ఏపీ పోలీసుల పనితీరును అభినందించారు. గత సమావేశాల మాదిరిగా వర్షాకాల సమావేశాలకూ పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. డీజీపీ ఆర్.పి.ఠాకూర్ మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన సిబ్బందిని నియమించామన్నారు. అసెంబ్లీ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వాటి ద్వారా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకుండా ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రైవేటు వాహనాల్లో వచ్చే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ముందుగా తమకు సమాచారమిస్తే, ఆ వాహనాలను తనిఖీలు చేయకుండా విడిచిపెడతామని స్సీకర్ కోడెల శివప్రసాదరావు దృష్టికి ఆయన తీసుకొచ్చారు. దీనిపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ, ప్రైవేటు వాహనాల్లో వచ్చే సభ్యులు ముందుగా తమకు తెలపాలంటూ సమాచారమివ్వాలని అసెంబ్లీ అధికారులను ఆదేశించారు. విజిటర్స్ కు ఇచ్చే పాస్ లపై గడువు కూడా పేర్కొనాలని డీజీపీ ఠాకూర్...స్సీకర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశాల్లో పలువురు పోలీసు అధికారులు, అసెంబ్లీ భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Related Posts