YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అళగిరి బలప్రదర్శన

అళగిరి బలప్రదర్శన
డీఎంకేలో ఇంటిపోరు మరింత ముదురుతోంది. తమ్ముడు, పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌పై రగిలిపోతున్న బహిష్కృత నేత అళగిరి చెన్నైలో బలప్రదర్శనకు దిగారు. మద్దతు దారులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలోని అన్నాసాలై ప్రాంతంలో ఉన్న అన్నాదురై విగ్రహం నుంచి కరుణానిధి సమాది వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనకు మౌన ప్రదర్శనగా పేరు పెట్టారు. నల్ల చొక్కాలతో స్టాలిన్‌తో పాటూ అనుచరులు ర్యాలీ పాల్గొన్నారు. అళగిరి కుమారుడు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. అళగిరి చేపట్టిన ఈ ర్యాలీకి అనుచరుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. మరోవైపు ఈ ర్యాలీ వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. వెయ్యిమంది పోలీసుల్ని మోహరించారు.కరుణానిధి మరణం తర్వాత డీఎంకేలో ఆదిపత్య పోరు మొదలయ్యింది. అప్పటి వరకు పార్టీకి దూరంగా ఉన్న అళగిరి వెంటనే యాక్టివ్ అయ్యారు. నిజమైన డీఎంకే కార్యకర్తలు తనవెంటే ఉన్నారంటూ వ్యాఖ్యలు చేసి ట్విస్ట్ ఇచ్చారు. తమిళనాడులో డీఎంకే అంత బలంగా లేదన్నారు. తర్వాత రెండుమూడుసార్లు అనుచరులు, మద్దతుదారులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 5న చెన్నైలో ర్యాలీ చేస్తానని కూడా ప్రకటించారు. ఈలోపే డీఎంకే పగ్గాలు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న స్టాలిన్‌‌కే దక్కాయి. అధ్యక్ష పదవికి ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాస్త మెత్తబడిన అళగిరి తమ్ముడి నాయకత్వాన్ని అంగీకరిస్తానని.. అయితే తనను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. తనను పార్టీలోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరికలు పంపారు. గతంలో చెప్పినట్లుగానే తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.ఇటు అళగిరి అల్టిమేటంపై స్టాలిన్ ఇప్పటి వరకు స్పందించలేదు. అంతేకాదు.. తన అన్న ర్యాలీకి డీఎంకే కార్యకర్తలు కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలను స్టాలిన్ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ర్యాలీ కూడా పూర్తి కావడంతో.. అళగిరి తర్వాత స్టెప్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. అళగిరి గతంలో డీఎంకేలో కీలకంగా వ్యవహరించారు. ఆయనంటే తండ్రి కరుణానిధికి ఎంతో ప్రేమ. ఆయన గతంలో కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. అయితే 2014లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. తర్వాత అళగిరి పార్టీలోకి రావాలని చూసినా కుదరలేదు. చిన్న కుమారుడు స్టాలిన్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇంతకాలం పార్టీకి దూరంగా ఉన్న అళగిరి.. తండ్రి మరణం తర్వాత డీఎంకేలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 

Related Posts