వైసీపీ అధినేత జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప పాదయాత్ర అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి నేటితో పరిస్థితిని పోల్చుకుంటే.. నాటికీ ఇప్పటికీ జగన్ చేస్తున్న విమర్శల్లో చాలా తేడా కనిపిస్తోంది. ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారన్న విమర్శల నుంచి జగన్ పూర్తిగా బయటపడుతున్నారు. ఆయన చేస్తున్న ప్రతి విమర్శల విషయంలోనూ ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. స్థానికంగా ప్రజలకు ఏమి అవసరమో.. వాటిపై దృష్టిపెట్టి ఆయా సమస్యలపై స్పందిస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రభుత్వం ఆయా విమర్శలపై కనీసం పన్నెత్తు మాట కూడా అనకపోవడం దీనికి ఉదాహరణగా మారుతోంది. విజయనగరంలో జ్వరాల పీడితులు.. మృతుల అంశంపై ప్రభుత్వం పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు. దీనినే జగన్ తీవ్రంగా భావిస్తున్నారు. వచ్చే రోజుల్లో మరింత పదునైన విమర్శలతో జగన్ విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాదయాత్రను ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఇక, ప్రారంభం నుంచి జనాలు పెద్ద ఎత్తున ఈ పాదయాత్రకు తరలి వస్తున్నాయి. పెద్ద ఎత్తున అభిమాన గణం పాదయాత్రకు తోడయ్యారు. ఎక్కడికక్కడ మహిళలు మంగళ హారతులతో ఎదురొచ్చి ఆహ్వానం పలుకుతున్నారు. ఇక, పాదయాత్ర చేస్తున్న ప్రతి ప్రాంతంలోనూ ఆయా సమస్యలపై జగన్ ప్రధానంగా స్పందిస్తున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చూపిస్తున్న అలివిమాలిన నిర్లక్ష్యంలో అక్కడి ప్రజలను ఎంతగా ఇబ్బంది పెడుతోందో కూడా జగన్ వెలుగులోకి తెస్తున్నారు.ప్రస్తుతం పాదయాత్ర విశాఖ జిల్లా పెందుర్తిలోకి అడుగు పెట్టింది. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఉన్నారు. ఆయన వ్యవహారం గత కొద్ది కాలంగా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. స్థానికంగా ఉంటున్నా.. ప్రజల సమ స్యలను పట్టించుకోవడం లేదని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో రాత్రిరాత్రి ఈ నియోజకవర్గం తాలూకు సమ స్యల పై నోట్ తయారు చేసుకున్న జగన్.. ప్రభుత్వ పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇక, ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కీలక పథకాలు ఇక్కడ అమలు కాకపోవడం మరింత విచారకరంగా మారింది.