ఆంధ్రప్రదేశ్‌లో చేరికలు.. తెలంగాణలో పొత్తులు.. రెండు రాష్ట్రాల్లో వ్యూహాత్మక అడుగులు వేయాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తోంది.. అటు టీఆర్‌ఎస్, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్‌లు బీజేపీతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. విభజన తరువాత తెలంగాణ విషయంలో ఏనాడూ వ్యతిరేకతతో వ్యవహరించలేదనే విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. ఇక ఆ పార్టీ నుంచి వలసలు ఉండవని భావించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కాంగ్రెస్ నేతలపై కనే్నసింది. ఇందులో భాగంగానే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొండ్రు మురళి పార్టీలో చేరటంతో పాటు మాజీ ఎంపీ సబ్బం హరిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్‌లో గత కొంత కాలంగా తటస్థంగా ఉంటున్న సీనియర్ నేత మైసూరారెడ్డి కూడా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పరిస్థితి ఈ రకంగా ఉంటే తెలంగాణలో ముందస్తును ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయమై ఆచితూచి అడుగేయాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ముందస్తు ఎన్నికల వ్యూహంపై శనివారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశం నిర్వహించనున్నారు.తెలంగాణలో వామ పక్షాలతో పాటు ఉద్యమనేత కోదండరామ్ నేతృత్వంలోని ఫ్రంట్, ఇతర పార్టీల మద్దతు కూడగట్టే అంశంపై ఏపీ నేతలతో సమాలోచనలు జరిపారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే తెలుగుదేశం పార్టీని విమర్శించాల్సిన అవసరం ఏముందనే రీతిలో పలువురు మంత్రులు టీఆర్‌ఎస్ వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేసీఆర్- మోదీ సాన్నిహిత్యంపై తెలంగాణలో ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు చెప్తున్నారు. అసెంబ్లీ రద్దుకు కారణాలు చెప్పకుండానే రద్దుచేశారని పార్టీనేతలు అభిప్రాయం వ్యక్తంచేశారు. జోనల్ వ్యవస్థకు ఆమోదం..రద్దు తదనంతర పరిణామాల చూస్తుంటే ముందస్తు ఒప్పందంగానే ఉందని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలు, గవర్నర్‌చేసే పనులు కూడా కేసీఆర్ చెప్పేస్తున్నారని మరో మంత్రి విమర్శించినట్లు తెలియవచ్చింది. తెలంగాణలో పార్టీకి ఇప్పటికీ కార్యకర్తల బలం ఉందని గట్టి పోరాటం ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పొత్తులు, ఇతరత్ర వ్యవహారాలపై తెలంగాణ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు పార్టీ అధినేత చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది.