జిల్లా కరవు పరిస్థితులు పతాక స్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో ఈ ఏడాది ముందస్తు కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా తాగునీటి సమస్య లేకుండా చూడాల్సి ఉంది. జిల్లాలోని 1003 పంచాయతీలు, నగర పంచాయతీల్లో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టాలి. అలాగే హంద్రీనీవా, తుంగభద్ర జలాశయం నుంచి తరలించే నీటిని తాగు, సాగుకు వినియోగించేలా చొరవ చూపాల్సి ఉంది.ముఖ్యంగా జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ 2014 ఎన్నికల్లో కదిరి, ఉరవకొండ నుంచి వైకాపా ఎమ్మెల్యేలుగా అత్తార్‌చాంద్‌బాషా, వై.విశే్వశ్వరరెడ్డి గెలుపొందారు. మిగతా 12 స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అయితే అత్తార్ చాంద్‌బాషా టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ ఎమ్మెల్యే సంఖ్య 13కు పెరిగింది.. ముఖ్యంగా 2019 ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమవుతుండటంతో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కానున్నాయన్న అభిప్రాయాలు అధికార పార్టీలోనూ వ్యక్తమవుతుండటం విశేషం. ముందస్తు ఎన్నికలు వచ్చినా, లేక గడువు ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించినా తిరిగి అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశాలు దాదాపు లేకపోవడంతో ఈ సమావేశాల్లోనే తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉండటంతో ఉచిత గ్రాసం సరఫరాకు చొరవ చూపాలని రైతులు, పశు పోషకులు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో సుమారు 5.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉన్నా, 33 శాతానికి మించి వేరుశెనగ, ఇతర పంటలు సాగులోకి రాలేదు. ఈసారి తీవ్ర వర్షాభావం కారణంగా ముఖ్యంగా వర్షాధార వేరుశెనగ పంటను రైతులు వేయలేక పోయారు. పంటల సాగు కోసం సబ్సిడీపై ప్రభుత్వం మంజూరు చేసిన విత్తన వేరుశెనగను కొనుగోలు చేసినా, విత్తుకోలేని దుస్థితిలో వాటిని తెగనమ్ముకున్నారు. జూలైలో పంటలు సాగు చేసినా ఎండిపోవడంతో ఒక్కో రైతు ఎకరాకు కనీసం రూ.18 వేల నుంచి రూ.20 వేలు నష్టపోయారు. పంటలు ఎలాగూ పండవని తేలిపోవడంతో ఇప్పటికే వలసలు వెళుతున్నారు. ముఖ్యంగా తూర్పు ప్రాంత మండలాల నుంచి అధికంగా వలసలు మొదలయ్యాయి. ముందస్తు కరవు ఉన్నా ఉపాధి పనులు కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందనే చెప్పాలి. దీంతో యంత్రాల ప్రమేయం లేకుండా ఉపాధి పనుల్ని అధికంగా కల్పించి వలసలు ఆపాల్సి ఉంది. ఒక్కో ఉపాధి కూలీకి రోజుకు కనీసం రూ.200 మేర గిట్టుబాటయ్యేలా యంత్రాలను వినియోగించకుండా పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇక జిల్లాలో 63 మండలాలకుగానూ 44 మండలాలనే కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. మిగతా వాటిని వెంటనే కరవు మండలాలుగా ప్రకటించేలా ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉంది. రైతులకు ఈ ఖరీఫ్ పంట నష్ట పరిహారంతోపాటు గత రెండు, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పరిహారాన్ని కూడా ఇప్పించాల్సి ఉంది. ఇంకా అసెంబ్లీల వారీగా స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రణాళికలను ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని జిల్లా ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు.