లక్షలాది ఎకరాలు ఎడారి భూములను తలపిస్తున్నాయి. జిల్లాలో అత్యధిక మండలాల్లో గడ్డికూడా మొలచని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మూగజీవాలైన పశువులను కాపాడుకునేందుకు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈనేపధ్యంలో జిల్లాలో ఏర్పడ్డ కరువు పరిస్థితులు పశువులకు కావాల్సిన పశుగ్రాసం కోసం జిల్లా పశుసంవర్థకశాఖ ఓ ప్రణాళిక రూపొందించి ప్రస్తుతం జిల్లాలో ఉన్న 23లక్షల పశువులను ఆదుకునేందుకు రూ.27.94కోట్లు నిధులు అవసరమని ఆ మేరకు ప్రణాళికను రాష్టప్రశుసంవర్థకశాఖ మంత్రి ప్రస్తుత జిల్లా మంత్రి అయిన ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర పశుసంవర్థకశాఖకు కూడా నివేదికలు పంపారు. కానీ ఇప్పటికీ అన్నిశాఖల కంటే ముందుగానే ఈప్రణాళికను పశుసంవర్థకశాఖ రూపొందించింది. వ్యవసాయం తర్వాత ఆ స్థానాన్ని పాడిరంగం దక్కించుకుంది. పాడితోపాటు సన్నజీవాల మేపు కూడా కష్టంగా ఉన్నట్లు ఈశాఖ నివేదికల్లో స్పష్టం చేసింది. జిల్లావ్యాప్తంగా చూస్తే ఎనుములు, దున్నలు కలిపి 4.50లక్షలు, ఆవులు 1.35 లక్షలు, మేకలు 4.53లక్షలు, గొర్రెలు 13.99లక్షలు ఉన్నాయని నివేదించారు. వీటి మేత కోసం వచ్చే ఏడాది జనవరి వరకు 10.29లక్షల టన్నులు పశుగ్రాసం అవసరం ఉందని నివేదించారు. ఇందులో రబీలో 32.803 హెక్టార్లలో సాగైతే హెక్టారుకు 5 టన్నులు చొప్పున 1,87,605 టన్నులు దిగుబడి రావచ్చునని ఇందువల్ల ఊరూరా పశుగ్రాసం క్షేత్రాలకు అందించనున్నారు. ఇందుకోసం 45,500 టన్నులు విత్తనాలు అవసరమని నివేదించారు. ఇందువల్ల జనవరి వరకు ఆరుమాసాలుగా జిల్లాలో 9.63లక్షల టన్నుల పశుగ్రాసం కావాల్సివస్తుందని నివేదించారు. జిల్లాలో కేసీ కెనాల్ ఆయకట్టు పరిధితోపాటు పెన్నానది పరివాహక ప్రాంతాల్లో కృష్ణాజలాలు పారే ప్రాంతాల్లో 37వేల 521 హెక్టార్లలో వరిసాగు అయ్యే అవకాశాలున్నాయని ఇందువల్ల ఆవులు, గేదెలకు పశుగ్రాసం కొరత కొంతమేరకైనా తీర్చవచ్చునని వెల్లడించారు. అలాగే 15920 ఎకరాల్లో పశుగ్రాసాన్ని సాగుచేయడం వల్ల 69వేల 680 టన్నులు పశుగ్రాసం వస్తుందని అధికారులు అంచనావేశారు. కాగా 15వేల టన్నుల పశువుల గ్రాసం అవసరమని ఇందుకోసం రూ.17.55కోట్లు నిధులు అవసరమని, 3.750 టన్నుల గడ్డికోసం రూ.255 కోట్లు, 1250టన్నుల లవన మిశ్రమానికి రూ.1.44 కోట్లు , 50 గడ్డి కత్తిరించే యంత్రాలకు రూ.15లక్షలు, పశుగ్రాసం విత్తనాల సరఫరాకు రూ.2.20కోట్లు ఊరూరా పశుగ్రాస క్షేత్రాలకోసం రూ.4.05కోట్లు, మొత్తం కలిపి రూ.27.94కోట్లు నిధులు అవసరమని అధికారులు నివేదికలు ప్రభుత్వానికి అందజేశారు. అయితే ఈ నిధుల్లో అరకొరగా ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేయగా ఆశించిన మేరకు నిధులు రాకపోవడంతో పూర్తిస్థాయి ప్రణాళికను అమలు చేసేందుకు పశుసంవర్థకశాఖ అధికారులు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. ఈనెల 2వ వారంలోనైనా ఈ నిధులు మంజూరవుతాయనే ఆశతో అధికారులు ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా కరవు నివారణ వ్యవహారంలో జిల్లాలో పశుసంవర్థకశాఖతోపాటు వ్యవసాయశాఖ సైతం ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకోసం నిరీక్షిస్తున్నాయని చెప్పక తప్పదు.