ఉత్తరాంధ్రలో ప్రబలుతున్న డెంగ్యూ, మలేరియా జ్వరాల పై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. డెంగీ,మలేరియా ప్రబలడంపై శనివారం నాడు ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డిఎంహెచ్ వోలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గోన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ వారం రోజులు అత్యవసర పరిస్థితి మాదిరిగా సీరియస్ గా పనిచేయాలి. సోమవారానికల్లా మార్పు రాకపోతే స్పాట్ లోనే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అసమర్ధతను, నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తేలేదు. బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించేది లేదు. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు పూర్తి బాధ్యతగా వ్యవహరించాలి. మనం ఉన్నది ప్రజల కోసమే, వారికి సేవలు అందించడం కోసమేనని అన్నారు. ఎందుకు నియంత్రించలేక పోతున్నారు..? ఎక్కడ మీరు విఫలం అయ్యారు..?అక్కడే ఎందుకని మకాం వేసి సకాలంలో చర్యలు తీసుకోలేదని నిలదీసారు. సమాచారం ఉంది, ఏం చేయాలో తెలుసు, మరెందుకు చర్యలు తీసుకోలేదు. కొందరు చేసిన తప్పులకు అందరికీ చెడ్డపేరు రావడాన్ని సహించను. విధి నిర్వహణలో అలక్ష్యాన్ని సహించేది లేదు. హుద్ హుద్ లాగానే విశాఖలో నేనే వచ్చి మకాం ఉంటానని అయన అన్నారు. వారం రోజులు అక్కడే మకాం వేస్తాను. మానవ తప్పిదాలు క్షమార్హం కాదు. ప్రతి స్థాయిలో సమన్వయం, సమర్థ నాయకత్వం ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎంపిలు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ప్రజల యోగక్షేమాలు విచారించాలి. వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందేలా శ్రద్ధ వహించాలి. ఆపదల్లో అండగా ఉండటమే మన బాధ్యత అని అన్నారు. ఈ రెండు రోజులు అసెంబ్లీకి సెలవులు, ఎంపిలకు కూడా పార్లమెంట్ లేదు. కాబట్టి ప్రజా ప్రతినిధులు అంతా క్షేత్ర స్థాయిలో పర్యటించాలి. ఆరోగ్య జాగ్రత్తలపై ప్రదర్శనలు నిర్వహించాలి, ప్రజలను చైతన్యపరచాలి. రాష్ట్రంలో ఎక్కడా అంటువ్యాధుల బెడదలేదు. ఒక్క విశాఖలోనే ఎందుకని ప్రబలాయి..? వివరణలు, సంజాయిషీలు కాదు నేను కోరుకునేది. మన కార్యాచరణ ప్రజల కళ్లకు కనిపించాలి. ఫలితాలే నాకు ముఖ్యమని అన్నారు. మీరు తీసుకున్న చర్యలు ఏమేరకు ఫలించాయి..? దానివల్ల ప్రజలకు ఎటువంటి స్వాంతన చేకూరింది అన్నదే ప్రధానం. నేను కోరేది బాధ్యతాయుత ప్రభుత్వాన్ని... మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ ఎందుకని వెళ్లలేదు..? వైద్యశాఖ సలహాదారు ఎందుకని వెళ్లలేదు..? నువ్వు వెళ్లాలా..? నేను వెళ్లాలా..?అనుకోవడం బాధాకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తలవంచుకోవాల్సిన పరిస్థితి తెస్తున్నారు. రోజువారీ ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? వివరించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రతిరోజూ హెల్త్ బులెటిన్లు, శానిటేషన్ బులిటెన్లు విడుదల చేయాలి. ఆర్టీజికి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఏవిధంగా స్పందనలు వచ్చాయి, ఏయే చర్యలు తీసుకున్నారు అనేది రోజువారీ బులెటిన్లలో వెల్లడించాలని ఆదేశించారు. విశాఖలో 72వార్డులకు ఒక్కొక్క సీనియర్ అధికారిని నియమించాలి. వార్డు పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలి. అధికారులు, సిబ్బంది ఇంటింటికి తిరగాలి. ప్రజల యోగ క్షేమాలు విచారించాలి. ఎక్కడెక్కడ మురుగు నిల్వలు ఉన్నాయో పరిశీలించాలి. యాంటి లార్వా ఆపరేషన్లు ముమ్మరం చేయాలి. దోమల ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసంచేయాలి. మురుగు నిల్వలపై ఆయిల్ బామ్ లు విడుదల చేయాలి. బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్ యుద్ధ ప్రాతిపదికన అన్నిచోట్ల చేపట్టాలి. క్లోరిన్ టాబ్లెట్లు పంపిణి చేయాలి. కాచి చల్లార్చిన నీటినే తాగేలా చైతన్యపరచాలి. ఎక్కడెక్కడ మురుగు నిల్వ చేరిందో ఫొటోలు తీసి పంపాలి. డ్రోన్ల ద్వారా అన్ని చోట్ల ప్రత్యేక పర్యవేక్షణలు జరపాలి. ఆసుపత్రికి ఈ రోజు ఎన్ని కేసులు వచ్చాయి అనేది నమోదు చేయాలి. ఆయా కేసులను జియో ట్యాగింగ్ చేయాలి. వ్యాధి సోకిన ప్రతి ఇంటి చుట్టుపక్కల వందఇళ్ల వారిని అప్రమత్తం చేయాలని అన్నారు.