YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ గ్రీన్ స్టేట్

తెలంగాణ గ్రీన్ స్టేట్

-దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో..
-టీఎస్ ఐపాస్‌తో పెట్టుబడుల ప్రవాహం
-టౌన్ ప్లానర్ల 66వ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
హరితహారం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని గ్రీన్ స్టేట్‌గా మారుస్తున్నామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తెలంగాణ కొత్త రాష్ట్రమైనప్పటికీ, అనేక అంశాల్లో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలుస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో  జరిగిన టౌన్ ప్లానర్ల 66వ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జూపల్లి మాట్లాడుతూ.. పరిశ్రమలకు సులువుగా అనుమతులను మంజూరు చేసే టీఎస్‌ఐపాస్ వంటి పాలసీ దేశంలోనే ఎక్కడా లేదని, అందుకే తెలంగాణకు పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. జాతీయ టౌన్ ప్లానర్ల సంఘం అధ్యక్షుడు కేఎస్ అకోడే మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో జరిగిన జాతీయ సదస్సుకు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. నగరాలు, పట్టణాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు ఈ సదస్సు విలువైన సూచనలు చేసిందని తెలంగాణ టౌన్ ప్లానర్ల సంఘం చైర్మన్ ఎస్ దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

అవార్డుల ప్రదానోత్సవం
ప్రొఫెసర్ వీఎన్ ప్రసాద్ పేరిట అందజేసే నేషనల్ బెస్ట్ థీసిస్ బహుమతులను సదస్సు ముగింపు సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రదానంచేశారు. ప్రథమ, తృతీయ బహుమతులను ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌కు చెందిన మహక్ అగర్వాల్, నైనా గుప్తా సాధించగా, ద్వితీయ బహుమతి మైసూరు ప్లానింగ్ స్కూల్‌కు చెందిన గౌతమ్ కొనికర్ అందుకున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇచ్చే ప్రొఫెసర్ డాక్టర్ డీఎస్ మేశ్రం జాతీయ ఉత్తమ థీసిస్ అవార్డు-2017ను భోపాల్‌కు చెందిన సార్థక్ వర్మకు అందజేశారు. పద్మశ్రీ ఎం ఫయాజుద్దీన్ మెమోరియల్ అవార్డును జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలకు చెందిన అజయ్ బండి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఏ టీకే శ్రీదేవి, జాతీయ టౌన్ ప్లానర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ నజ్ముద్దీన్, ఉపాధ్యక్షుడు ఎస్డీ సైనీ తదితరులు పాల్గొన్నారు.

సదస్సులో విలువైన సూచనలు
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగిన 66వ జాతీయ టౌన్ ప్లానర్ల సదస్సు విజయవంతమైంది. సదస్సులో దాదాపు 22 రాష్ట్రాల నుంచి 400కుపైగా నిపుణులు, అర్బన్ ప్లానర్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ప్రారంభోత్సవంలో పాల్గొన్న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సదస్సులో నూతనోత్సాహాన్ని నింపారు. సదస్సు ద్వారా ఆచరణాత్మకమైన సూచనలను చేయాలని కోరారు. దీంతో పట్టణాలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యల పరిష్కారానికి నిపుణులు విలువైన సూచనలు చేశారు. నగరాల్లో ఇంధన వినియోగం పెరిగి, వాయు తదితర ఉద్గారాలు అధికంగా విడుదలవుతున్న నేపథ్యంలో నగరస్థాయి మాస్టర్ ప్లాన్లలో వాతావరణ మార్పు విధానాలను పొందుపర్చాలని ఐటీపీఐ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా) సూచించింది. మాస్టర్ ప్లాన్లలో విపత్తు నివారణకు నిబంధనలను సిద్ధంచేయాలని పేర్కొన్నది. పట్టణాభివృద్ధి, పర్యావరణ శాఖలు కలిసికట్టుగా మాస్టర్ ప్లాన్లు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై ఆమోదముద్ర వేయాలని, ఖాళీ స్థలాలను గుర్తించి హరితమయంగా మార్చాలని, భూగర్భజలాలను పెంచడంపై దృష్టి సారించాలని సూచనలు చేసింది.

Related Posts