భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి లభిస్తున్న స్వేచ్ఛతో అతను జట్టులోని ఆటగాళ్లను శాసించే స్థాయికి చేరుకుంటున్నాడని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రార్లీ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ నిరంకుశత్వం ఇలానే కొనసాగితే.. డ్రెస్సింగ్ రూములో క్రికెటర్లు కనీసం తమ అభిప్రాయాలను కూడా అతనితో పంచుకోలేరన్నాడు. ప్రస్తుతం భారత జట్టు ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ‘విరాట్ కోహ్లీ ఆటని నేను చాలా ఆస్వాదిస్తాను. అతను చాలా తెలివైన కెప్టెన్ కూడా. అంతేకాకుండా మైదానంలో చురుగ్గా వ్యవహరిస్తూ.. అందరి చూపుని తనవైపు తిప్పుకోగలడు. కానీ.. కొన్ని సందర్భాల్లో అతను చూపే నిరంకుశత్వ ధోరణి జట్టుకి ప్రమాదకరంగా నాకు కనిపిస్తోంది. ఒక కెప్టెన్‌గా.. ఆటగాళ్లను ఆదేశించే అధికారం అతనికి ఉంది. కానీ.. అది మితిమీరితే..? క్రికెటర్లు కనీసం అతనితో తమ అభిప్రాయాలను కూడా పంచుకునేందుకు భయపడతారు’ అని మైక్ బ్రార్లీ వెల్లడించాడు.