రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలను ఎదుర్కొనేందుకు బీజేపీ తగిన వ్యూహాలను సిద్దంచేస్తోంది. దీనిలో భాగంగానే అత్యంత కీలకంగా భావిస్తున్న లోక్‌సభ ఎన్నికల ప్రచార బాధ్యతను ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షానే మోయనున్నారు. దీంతో 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు ఆయనే కమళదళ అధిపతిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు శనివారం ఢిల్లోలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు 2014 ఆగస్ట్‌లో బాధ్యతులు తీసుకున్న విషయం తెలిసిందే. షా నాయకత్వంలోనే బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదుచేసి.. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.బీజేపీలో అపర చాణిక్యుడిగా గుర్తింపు పొందిన అమిత్‌షా గత ఫలితాలను పునరావృత్తం చేయడానికి సిద్దమవుతున్నారు. 2019 జనవరితో ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకూ జాతయ నాయకత్వం ఆయన పదవీకాలాన్ని పొడిగించినట్లు సమాచారం. బీజేపీ జాతీయనేతలు పాల్గొన్న ఈ సమావేశంలో నేతలందరు ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అన్ని సీట్లు సాధించడం బీజేపీకి అంతసులువైన అంశంకాదు. ఇప్పటికే అధిక పెట్రోల్ ధరలు, రాఫెల్ ఒప్పదం, నొట్ల రద్దు వంటి అంశాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 లోక్‌సభ ఎన్నికలును బీజేపీ అంత తేలికగా తీసుకోవడంలేదు. దీంతో వ్యూహాలు రచించడంతో దిట్టగా పేరొందిన అమిత్ షానేను లోక్‌సభ ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగించేందుకు కమళం నిర్ణయించింది.