అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి కార్డు ఇచ్చి నిత్యావసర సరకులు పంపిణీ చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజా సాధికార సర్వేలో నమోదు చేయించుకున్న కుటుంబాలకు అర్జితో నిమిత్తం లేకుండా కార్డులు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పలువురు ఎమ్మెల్యేలు పౌరసరఫరాల శాఖలో ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్ఠికి తీసుకురాగ ఆయన శుక్రవారం నాడు అసెంబ్లీ సమావేశ మందిరంలో ఎమ్మెల్యేలు, పౌరసఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్, డైరెక్టర్ సూర్యకుమారి మరియు ఆర్టీజీఎస్, సి.ఇ.ఓ, బాబు ఏ, మరియు ఎన్‌ఐసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అమలులో ఉన్న కోటి 44 లక్షల కార్డుదారులకు నెలకు 2.26 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 300 కోట్ల రూపాయలను సబ్సీడీగా భరిస్తుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇప్పటికే ప్రజాసాధికార సర్వేలో నమోదు చేయించుకున్న 65 వేల కుటుంబాలకు నూతన రేషన్ కార్డులను జారీ చేయడమైనది అని అన్నారు. అదే విధంగా గ్రీవెన్స్, జన్మభూమిలో వచ్చిన అర్జీలను మరియు ప్రజాసాధికార సర్వేలో నమోదు చేయించుకున్న 3.78 లక్షల కొత్త సభ్యులను ఉన్న కార్డులలోనే చేర్చి రేషన్ సరుకులు అందిస్తామన్నారు, అలాగే 3.50 లక్షల కార్డులను గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.ఈసమావేశంలోఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, విప్‌లు చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్, ఎమ్మెల్యేలు బూరుగపల్లి శేషరావు, అరసమిల్లి రాధాకృష్ణ, పల్లా శ్రీనివాస్, శ్రావణ్‌కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.