ఆ 22 మందిపై అనర్హత వేటు వేయకపోవడంతో జగన్ పాదయాత్ర తర్వాత ప్రత్యకంగా ఆ నియోజకవర్గాల్లో పర్యటించడానికి రెడీ అవుతున్నారు. వైసీపీ గుర్తు మీద గత ఎన్నికల్లో గెలిచి పార్టీని ఫిరాయించి నమ్మకద్రోహం చేసిన వారిని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. పార్టీలు మారిన వాళ్లు తిరిగి ప్రజలు గెలిపించరనే సంకేతాలు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఆ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కొందరు మంత్రులగా ప్రమాణ స్వీకారం చేసి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై బురద జల్లే విధంగా మాట్లాడటాన్ని పార్టీ సీరియస్ గా తీసుకుంది.ఎన్నికల్లో వైసీపీ గుర్తు మీద గెలిచిన పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, పాతపట్నం ఎమ్మెల్యే కలమలవెంకటరమణ, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎర్రగొండ పాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా, పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాధ్ రెడ్డిలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఇందులో నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డి పార్టీ మారడంతో హఠాన్మరణంచెందడంతో ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచింది.వీరితో పాటు అరకు ఎంపీ కొత్త పల్లిగీత, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే బుట్టా రేణుకలు కూడా పార్టీని వీడారు. ఈ నియోజకవర్గాల్లో వైసీపీకి ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఉంది. అద్దంకి నియోజకవర్గం మినహాయిస్తే ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులను దాదాపుగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. జగన్ ప్రస్తుతం విశాఖ జిల్లాలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. విశాఖతో పాటు ఆయన విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. పాదయాత్ర నవంబరు చివరి వారంలో ముగించాలని జగన్ భావిస్తున్నారు. నవంబరు చివరి వారంలో పాదయాత్ర ముగిసిన తర్వాత వారం రోజులు గ్యాప్ ఇచ్చి ఈ 22 నియోజకవర్గాల్లో పర్యటనలకు జగన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.పాదయాత్ర ముగిసిన తర్వాత బస్సు యాత్ర చేద్దామని తొలుత జగన్ భావించారు. అయితే బస్సు యాత్ర కంటే ముందు భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యర్థులకు తానేంటో చూపాలన్నది జగన్ లక్ష్యంగా తెలుస్తోంది. నమ్మకద్రోహం చేసిన వారిని తిరిగి గెలిపించవద్దని జగన్ ఈ సభల ద్వారా పిలుపునివ్వనున్నారు. పార్టీ మారిన వారిలో కొందరు తిరిగి పార్టీలోకి వస్తామనిచెబుతున్నా జగన్ అంగీకరించకుండా, వారి ఇలాకాలోనే విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద పాదయాత్ర ముగింపు దశలో ఉండగానే జగన్ తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.