- ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్
‘అమ్మ’ను కోల్పోయి సతమతమవుతున్న అన్నాడీఎంకేను ‘చిన్నమ్మ’ మాత్రమే నడిపించగలరని ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ తెలిపారు. తంజావూరు జిల్లా కుంభకోణం సమీపాన స్వామిమలైలో ఆయన ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా టాపులేని వాహనంలో నుంచి ఆయన మాట్లాడారు.‘అమ్మ’లేని అన్నాడీఎంకేను ‘చిన్నమ్మ’ మాత్రమే నడిపించగలరని, అయితే ప్రజలను మోసం చేసేందుకు కొందరు చూస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం త్వరలో గద్దె దిగనుందని, అప్పుడు జయలలిత ప్రభుత్వం ఏర్పాటు కానుందని జోస్యం చెప్పారు. ఆ ప్రభుత్వం ఏర్పడితే స్వామిమలైలో బస్టాండు సహా అన్ని వసతులు కలగనున్నాయని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టబోయిన పలు ప్రాజెక్టులను జయలలిత అడ్డుకున్నారని తెలిపారు. ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి భయపడి ప్రభుత్వం వాటిన అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజావ్యతిరేక పరిపాలన, బినామీ పాలన జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ రవాణాసంస్థలు నష్టంలో నడుస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోందని, జయలలిత ఉన్నంతవరకు బస్సుఛార్జీలు పెంచలేదని గుర్తుచేశారు. ఆమె పేరుతో పరిపాలిస్తున్నామని చెప్పే వారు 60శాతం ఛార్జీలు పెంచారని.... కంటితుడుపు చర్యలుగా కొంత తగ్గించారని ధ్వజమెత్తారు. దీంతో అట్టడుగు ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణాసంస్థల నష్టాన్ని తగ్గించాలంటే కేంద్రప్రభుత్వం డీజిల్‌పై ఎక్సైజ్ పన్ను తగ్గిస్తే సరిపోతుందన్నారు. రాష్ట్రప్రభుత్వం ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. తంజావూరు జిల్లా రైతుల కష్టాలు పోగొట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం వరకు వెళ్లి కావేరి జలాలను జయలలిత పొందారని తెలిపారు. ప్రస్తుతం ఈ డెల్టా ప్రాంతాల్లో పంట ఎండిపోతోందని వాపోయారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసేందుకు పళనిస్వామి ఎదురుచూస్తుండటంతో హాస్యాస్పదమని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాన్ని విస్మరించారని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏడున్నర కోట్ల ప్రజల అభీష్టం మేరకే ఆర్కేనగర్ ఉప ఎన్నికలో తాను ఘనవిజయం సాధించానని తెలిపారు. ఈ సందర్భంగా కుంభకోణం నియోజకవర్గంలోని ఆరూర్, కుంభకోణం గాంధీపార్క్, తారకాసురం, పట్టీశ్వరం, మరుదానల్లూర్, చెట్టి మండలం తదితర ప్రాంతాల్లోనూ టీటీవీ దినకరన్ పర్యటించారు.