పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో మరో కీలకపరిణామం చేసుకుంది. దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ స్కాంగా నిలిచిన ఈ కేసులో డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. తాజాగా పీఎన్‌బీ స్కాం కేసులో ఇంటర్ పోల్ అధికారులు బెల్‌గావ్‌లో ఉంటున్న మోదీ సోదరి పుర్వీ దీపక్ మోదీ వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు మనీ లాండరింగ్ చట‍్టం కింద ఈ నోటీసులిచ్చినట్టు అధికారులు వెల్లడించారు.స్పెషల్ ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ చట్టం కింద ముంబైకోర్టు ఈ నోటీసులిచ్చింది. మోదీ సోదరి, సోదరుడు నిశాల్ సెప్టెంబర్ 25న, లేదా అంతుకుమందు గానీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కాని పక్షంలో భారీ ఆర్థిక సంక్షోభాలను నిరోధించేందుకు ఉద్దేశించిన నూతన చట్టం కింద వారి ఆస్తులను జప్తు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు గత వారం నీరవ్ మోదీ సన్నిహితుడు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మోహిర్ ఆర్ బన్సాలికి (40) ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.కాగా రూ.14వేల కోట్ల రుణాలను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ, మరో డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీని దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వీరి పాస్‌పోర్టులను రద్దు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇరువురికి చెందిన పలు ఆస్తులను ఎటాచ్ చేసింది. ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు.