ఈ నెల 29న పశ్చిమగోదావరి జిల్లా తాడెపల్లిగూడెంలో ధర్మపోరాట దీక్ష జరగనుంది. ధర్మపోరాట దీక్షకు ఏర్పాట్లపై అసెంబ్లీ టిడీఎల్పీ సమావేశ మందిరంలో పశ్చిమగోదారి జిల్లా నాయకులతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రులు కొల్లు రవీంద్ర, పితాని సత్యనారాయణ, జవహార్, ఎంపిలు మాగంటి బాబు, సీతారామక్ష్మి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్ లు పాల్గోన్నారు. లక్ష యాభై వేల మందికి పైగా హాజరయ్యే ధర్మ పోరాట దీక్షను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పుల్లారావు అన్నారు. ధర్మపోరాట దీక్ష నిర్వహణ వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ధర్మపోరాట దీక్షలో పాల్గొనాలి. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఐదుకోట్ల రాష్ట్ర ప్రజల తరుపున సీఎం ధర్మపోరాటదీక్ష చేస్తున్నారు. విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం మొండిచేయి చూపిన వైనాన్ని సీఎం ప్రజలకు వివరిస్తారని మంత్రి వెల్లడించారు.