YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అశోక గజపతి రాజు కూతురు అధితి పొలిటికల్ ఎంట్రీ

అశోక గజపతి రాజు కూతురు  అధితి పొలిటికల్ ఎంట్రీ

ఉత్త‌రాంద్ర‌కు చెందిన టిడిపి సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు కూతురు ‘అధితి గజపతి రాజు’ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ జిల్లా భీమిలి నుంచి పోటీ చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. విజయనగరం రాజుల వారసురాలిగా ఆమె 2019 ఎన్నికల్లో బరిలో ఉంటారని విజయనగరం జిల్లా టిడిపి నాయకులు చెబుతున్నారు. ‘అశోక్‌’ కుమార్తె అయిన ‘అదితి’ ఇటీవల కొంత కాలంగా రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నార‌ని తెలుస్తోంది.  కార్యకర్తలను కూడా కలుసుకుంటున్నారు. ప్రజల మధ్యకు వెళుతూ ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. అలాగే వారు చెప్పిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. విజయనగరం జిల్లాలో ‘పూసపాటి’ రాజవంశస్తులు మొదటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. ‘పూసపాటి’ తొలితరంలోని వారు కాంగ్రెస్‌లో ఉన్నారు. టిడిపి ఆవిర్భావం తరువాత ‘పూసపాటి అశోక్‌గజపతిరాజు’ టీడీపీలో చేరి కీలకనేతగా ఎదిగారు. 1983 నుంచి ప్రతి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తూ అసెంబ్లీకి ఎన్నికవుతూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో తాను విశ్రాంతి తీసుకుని, తన కుమార్తె ‘అదితి’ని ఎన్నికల రంగంలోకి దింపాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

 తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్‌ అయిన అశోక్‌ గజపతిరాజు త‌న కుమార్తె రాజ‌కీయ ప్ర‌వేశం గురించి నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు కూడా కాదనలేరని ఆ పార్టీ నేత‌లు అంటున్నారు. తన కుమార్తె అదితికి టిక్కెట్‌ కావాలని అశోక్‌ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావించారని స్థానికి టీడీపీ నేత‌లు చెబుతున్నారు. అయితే ఇదే జరిగితే టీడీపీ నేత గంటా వర్గానికి గట్టి షాక్‌ ఇచ్చినట్టే అవుతుంది. గంటాను ఈసారి అనకాపల్లి ఎంపీగా పంపించాలని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. అశోక్‌ గజపతిరాజు నిర్ణయాన్ని ఎదిరించి భీమిలి టిక్కెట్‌ తనకే ఇవ్వాలని అడిగే ధైర్యం గంటా చేయ‌లేర‌ని, అదంత సులువు కాదని పార్టీ వర్గాల చెబుతున్నాయి. ప్రాధాన్యత పరంగా చూసినా అదితికే భీమిలి టిక్కెట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని నియోజకవర్గ శ్రేణులు భావిస్తున్నాయి. గంటాను భీమిలి నుంచి కాకుండా అనకాపల్లి ఎంపీగా పంపితే పార్టీ నిర్ణయాన్ని ఆయన కట్టుబడి ఉంటారా? లేదా అనేది పార్టీలో ప్రశ్నార్ధకంగా మారింది. రానున్న కాలంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు ఏవిధంగా మారుతాయో వేచి చూడాల్సిందే. 

Related Posts