డ్వాక్రా సంఘాల్లోని ఆడపడుచులకు ఒక్కొక్కరికీ ‘చంద్రన్న పసుపు కుంకుమ’ కింద పదివేల రూపాయల చొప్పున ఇస్తున్నామని ఏపీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఏపీ అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ‘చంద్రన్న పసుపు కుంకుమ’ కింద ఇప్పటి వరకూ మూడు విడతల్లో రూ.6,883 కోట్లు విడుదల చేయడం జరిగిందని, వడ్డీ లేని రుణాలిస్తున్నామని, అలాగే, వృద్ధులకు వికలాంగులకు రూ.200గా ఉన్న నెల వారీ పెన్షన్ ని తమ ప్రభుత్వం వచ్చాక వెయ్యి రూపాయలకు పెంచిన విషయాన్ని ప్రస్తావించారు.అలాగే, ఎనభై శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నవారికి పెన్షన్ ను రూ.500 నుంచి రూ.1500కు పెంచామని, చేనేత, గీత కార్మికులకు, ఎయిడ్స్ వ్యాధి బాధితులకు రూ.1500 ఇస్తున్నట్లు చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలెవ్వరూ ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో సీఎం చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తున్నారని సునీత అన్నారు.