ఆఖరి టెస్టులో ఓదార్పు విజయం కోసం ఎదురుచూసిన భారత్‌కు మరో భంగపాటు. అయితే అంచనాలకు మించి పోరాడిన భారత బ్యాట్స్‌మెన్ మరీ తేలిగ్గా చేతులెత్తేయలేదు. కేఎల్ రాహుల్ (149; 224 బంతుల్లో 20×4, 1×6), రిషబ్ పంత్ (114; 146 బంతుల్లో 15×4, 4×6) అసాధారణంగా ఆడి సెంచరీలు సాధించినా.. ఆఖర్లో పట్టు కోల్పోయిన భారత్ ఐదో టెస్టులో 118 పరుగుల తేడాతో ఓడిపోయింది. అండర్సన్ (3/45), కరన్ (2/23), రషీద్ (2/63) ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-1తో గెలిచి పటౌడీ ట్రోఫీని కైవసం చేసుకుంది. సిరీస్ ఆసాంతం రాణించిన విరాట్ కోహ్లి, సామ్ కరన్‌లకు ఉమ్మడిగా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ లభించింది.