ఆ రెండు రాష్ట్రాల ఫీవర్ బీజేపీని వదిలేటట్లు లేదు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో నేతలకు సీరియస్ గా క్లాస్ పీకినట్లు సమాచారం. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత వల్ల బీజేపీకి నష్టం వాటిల్లే అవకాశముంది. అనేక ప్రయివేటు సంస్థల సర్వేలతో పాటు, అంతర్గత సర్వేలు కూడా ఈవిషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, మాయవతి సారథ్యంలోని బీఎస్సీ పొత్తు కుదుర్చుకుంటే కష్టమేనన్నది కమలదళపతుల అంచనా.మధ్యప్రదేశ్ లో దాదాపు మూడు దఫాలుగా బీజేపీ సర్కార్ కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ లో ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకోవడంతో అక్కడ విజయావకాశాలపై అమిత్ షా మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు రాకేశ్ సింగ్ తో చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానంలో ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా గెలిచిన స్థానాల్లో అభ్యర్థులను మార్చే విషయంపై కూడా ఆయన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అందుకోసం గెలుపు గుర్రాలతో అభ్యర్థుల జాబితాను రూపొందించాల్సిందిగా ఆయన రాకేశ్ సింగ్ ను ఆదేశించారు.ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత ఈ రెండు రాష్ట్రాల నేతలతో బీజేపీ చీఫ్ అమిత్ షా విడివిడిగా చర్చలు జరిపారు. బీఎస్పీ, కాంగ్రెస్ కలిస్తే ఓట్ల శాతం విపక్షాలకు మెరుగుపడుతుందన్న ఆందోళనను ఈ సమావేశంలో అమిత్ షా వ్యక్తం చేశారు. బీఎస్పీకి సాలిడ్ ఓటు బ్యాంకు ఉంటుంది. గత ఎన్నికల్లోనూ బహుజన్ సమాజ్ పార్టీ ఐదు నుంచి ఎనిమిది శాతం ఓట్లు సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు. అందువల్ల దళిత, అగ్రవర్ణాల ఓట్లను ఆకట్టుకునే విధంగా ప్రచార సరళి సాగాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారు.అలాగే రాజస్థాన్ లో కూడా వసుంధరరాజే ప్రభుత్వంపై తీవ్ర వ్యతరేకత వ్యక్తమవుతుండటంపై కూడా అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రధానంగా బీఎస్పీ ఓట్లు కీలకంగా మారతాయని ఆయన ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మదన్ సైనీతో అన్నట్లు సమాచారం. ముఖ్యంగా అగ్రవర్ణాలు, ఓబీసీలు, రైతుల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని షా నిర్దేశించినట్లు సమాచారం.