తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 13వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, అదే రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. ఆగమ పండితులు సూచనల మేరకు వాహన సేవలను గంట ముందుగా ప్రారంభిస్తామని, గరుడ వాహనాన్ని రాత్రి ఏడు గంటల నుంచే ప్రారంభిస్తామని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల, దాతలకు సంబంధించిన ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు చెప్పారు. భక్తుల కోసం ఏడు లక్షల లడ్డూలను సిద్ధం చేసినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంతో పాటు, ఇతర ముఖ్యమైన ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించామన్నారు. విద్యుదలంకరణలు, పెయింటింగ్, బ్యారికేడ్లకు తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్లు తెలిపారు. రూ.26 కోట్లతో అదనపు మరుగుదొడ్లు నిర్మించామని, వాహనాలను తిలకించేందుకు మాడవీధుల్లో 19, భక్తులు రద్దీ ఉండే ప్రాంతాల్లో 12, మొత్తం 31 డిజిటల్ స్క్రీన్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. గరుడసేవ రోజున గ్యాలరీల్లో ఉండే రెండు లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు, మూడు లక్షల మజ్జిగ ప్యాకెట్లు, ఆరు లక్షల తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు. బ్రహ్మోత్సవాల్లో కాటేజీ దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామని తెలిపారు. అయితే ఈనెల 15 నుంచి 17 వరకు, అక్టోబరు 12 నుంచి 14 వరకు కాటేజీ దాతలకు గదులు కేటాయింపులు ఉండవని తెలిపారు. ఆలయ మాడ వీధులు, కాటేజీలు, యాత్రికుల వసతి సముదాయాలు, సామూహిక మరుగుదొడ్ల వద్ద మెరుగైన పారిశుధ్యం కోసం 800 మందిని నియమించామని తెలిపారు. ఇంకా 11 ప్రథమ చికిత్సా కేంద్రాలు, 12 అంబులెన్సులు అందుబాటులో ఉంచామన్నారు. అన్ని సేవలను ఎస్‌విబిసి ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామన్నారు. వాహనాల సేవలకు ముందు స్థానిక కళాకారులతో పాటు, వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఇంకా తిరుమలలోని ఆస్థాన మండపం, నాదనీరాజనం వేదికలతో పాటు, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, శిల్పారామంలలో ఆధ్యాత్మిక,ధార్మిక ఉపన్యాసాలు, సంగీత కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తిరుమల జేఈవో కెఎస్ శ్రీనివాస రాజు మాట్లాడుతూ గరుడ సేవ సందర్భంగా ఈ నెల 16, 17 తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామని, అదే విధంగా 17న సర్వదర్శనం టోకెన్లు, రూ.300లు ప్రత్యేక ప్రవేశ టోకెన్లు రద్దు చేసినట్లు తెలిపారు.