రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను తక్షణమే గుర్తించి సరిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తెలంగాణాలోని కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగి 58మంది మృతి చెందిన నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రయాణీకుల భద్రత, రోడ్డుప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, రోడ్లు భవనాలశాఖ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవడంతో పాటు ఏవైనా సమస్యలుంటే వెంటనే మరమ్మత్తులు చేయాలని సూచించారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆర్టీసి డ్రైవర్లకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రజల్లో సైతం రహదారి భద్రతపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని చంద్ర బాబు సూచించారు.