లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా రాజకీయ చిచ్చు రేపారు. తాను దేశం విడిచి వెళ్లేముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశానని, తాను బ్యాంకుల రుణాలన్నీ సెటిల్ చేస్తానని జైట్లీతో చెప్పానని నిన్న వెస్ట్ మినిస్టర్ కోర్టు వద్ద మాల్యా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ నేతలకు తెలిసే మాల్యా విదేశాలకు చెక్కారని కాంగ్రెస్ ధ్వజమెత్తుతోంది. అంతేకాదు అరుణ్ జైట్లీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది.లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారత్ లోని పలు బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు రుణాలు ఎగ్గొట్టి వెళ్లిన సంగతి తెలిసిందే. తర్వాత ఎంచక్కా విజయ్ మాల్యా లండన్ కు చెక్కేశారు. అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. క్రికెట్ అంటే పడిచచ్చే మాల్యా ఆ దేశంలో ఏ మ్యాచ్ జరిగినా హాజరవుతున్నారు. మాల్యాను భారత్ కు అప్పగించాలన్న కేసును వెస్ట్ మినిస్టర్ కోర్టు విచారిస్తుంది. దీనిపై తుది తీర్పు డిసెంబరు 10న వెలువడనుంది.అయితే ఈలోపు మాల్యా వ్యాఖ్యలు భారత్ లో పెను రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీలు మోసం చేసి విదేశాలకు వెళుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారికి వత్తాసు పలుకున్నారన్న ఆరోపణలు గత కొంతకాలంగా విన్పిస్తున్నాయి. అయితే వీరిలో ముఖ్యంగా విజయ్ మాల్యాను భారత్ కు రప్పించేందుకు ప్రభుత్వం తరుపున అధికారులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.
మాల్యా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జైట్లీ రాజీనామాకు డిమాండ్ చేశారు. దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. మాల్యా దేశం వదిలి వెళ్లడానికి ఎలా అనుమతిచ్చారో వివరణ ఇవ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. మొత్తం మీద మాల్యా పెట్టిన చిచ్చు ఇప్పట్లో ఆరేలా కన్పించడం లేదు.