YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రధాని పదవిపై మాయ కన్ను

ప్రధాని  పదవిపై మాయ కన్ను

ఉడుంపట్టు… అనేకంటే ఎన్నికల సీజన్లో మాయాపట్టు అనొచ్చేమో. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఇప్పుడు మొండిపట్టుతో తనదైన స్టయిల్ తో అనుకున్న సీట్లు దక్కించుకునేలా అడుగులు వేస్తున్నారు.వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయించకున్నప్పటికీ మాయావతి దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. దళితనేతగా, మహిళగా తనకు అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నారు. దీంతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో అక్కడి కాంగ్రెస్ నాయకత్వం బీఎస్పీకి ఎక్కువ స్థానాలు ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతోనే మాయావతి కాంగ్రెస్ పై ఆరోపణలకు దిగుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద మాయా వ్యాఖ్యలతో మహాకూటమి ఏర్పడక ముందే విపక్షాల్లో అయోమయం నెలకొందని చెప్పొచ్చు. ఒకవేళ అధికారం చేపట్టడానికి విపక్షాలకు అవకాశం లభిస్తే తానే ప్రధాని పదవికి ప్రధాన పోటీదారునని చెప్పకనే చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అన్ని విపక్షాలూ ఏకమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ అయితే విపక్షాలతో మహాకూటమికి కొంగు బిగించారు కూడా. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా జాతీయ స్థాయిలో విపక్షాలన్నీ ఒక్కటవ్వాలని ప్రయత్నిస్తున్నారు. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన మాయావతి మాత్రం మహాకూటమిపై నోరు మెదపడం లేదు. కొన్నాళ్లుగా ఆమె వీటన్నింటికీ దూరంగా ఉంటున్నారు. యూపీలో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, ఆర్ఎల్డీలు కలసి మహాకూటమిగా ఏర్పడి మోదీకి షాకివ్వాలని నిర్ణయించాయి. ఇందుకు మాయావతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. యూపీలో వరకూ ఎస్పీతో కలసి వెళ్లాలని, ఇందుకు గత ఎన్నికల ఫలితాలను బట్టి సీట్లను పంచుకోవాలని ఫార్ములాను కూడా రూపొందించుకున్నారు.కాంగ్రెస్ పై మాత్రం మాయవతి కస్సుమంటూనే ఉన్నారు. మాయావతి టార్గెట్ ప్రధాని పదవి కావడంతో ముందుగానే కాంగ్రెస్ ను కట్టడి చేయాలని ఆమె భావిస్తున్నట్లుంది. అందుకే పెట్రోలు ధరల పెంపుపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బంద్ కు పిలుపునిస్తే మాయావతి పార్టీ దానికి దూరంగా ఉంది. దూరంగా ఉండటమే కాకుండా కాంగ్రెస్ పై మాయావతి తీవ్ర విమర్శలు కూడా చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే పెట్రోలు ధరల నిర్ణయాన్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని మాయావతి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి.

Related Posts