కర్నూలు జిల్లా కర్నూలు ఎంపీ టికెట్ విషయం.. వైసీపీలో గందరగోళానికి దారితీస్తోంది. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయంపై స్పష్టత లేకపోవడంతో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. మరో ఆరేడు మాసాల్లోనే ఎన్నికలు ఉండడం, ఇవి ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో అభ్యర్థి ఎవరనే విషయంపై జగన్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇక్కడి నాయకులు భావిస్తున్నారు. ఈ టికెట్ కోసం.. ముస్లిం వర్గానికి చెందిన ఒకరు, బీసీ వర్గానికి చెందిన మరొకరు పోటీ పడుతున్నారు. వాస్తవానికి గత ఎన్నికల విషయాన్ని చూస్తే.. 2014లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన బుట్టా రేణుక విజయం సాధించారు. అయితే, వచ్చే ఎన్నికలకు సంబంధించి టికెట్ విషయమై జగన్‌కు, ఆమెకు మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆమె టీడీపీలోకి చేరారు.ఇక్కడ వైసీపీకి బలమైన అభ్యర్థి అవసరం ఎంతైనా ఉంది. వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుకకు టికెట్ ఇస్తామని టీడీపీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆమెను ఎదుర్కొనేందుకు జగన్ గట్టి వ్యూహంతోనే బరిలోకి దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా కర్నూలుకు వచ్చిన జగన్మోహన్‌రెడ్డి …కర్నూల్ లోక్‌సభ టికెట్‌ను బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకే ఇస్తానని చెప్పారు.. అలా అయితే జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు బీవై రామయ్య ఒక్కరే ఉన్నారు. ఆయన ప్రస్తుతం కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. టికెట్ కోసం ఈయనకు పోటీ వచ్చే మరో నాయకుడు పార్టీలో లేరు.. ఎలాగూ టికెట్ దక్కుతుందన్న గట్టి నమ్మకం ఉండటంతో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు.కాంగ్రెస్‌పార్టీలో ఉన్నప్పట్నుంచి నియోజకవర్గ ప్రజలతో రామయ్య సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు.. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి సన్నిహితు లుగా ఉన్నారు.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పని చేశారు.. 2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేశారు కూడా! ఇదిలావుంటే, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు అసెంబ్లీ టికెట్ బదులు లోక్‌సభ టికెట్ ఇవ్వ బోతున్నారంటూ ఆ పార్టీలోనే చెప్పుకున్నారు. మీడియాలో కూడా ఈ రకమైన ప్రచారమే జరిగింది. అయితే ఈ వార్తలను హఫీజ్‌ఖాన్ కొట్టిపారేశారు. మాజీ ఐజీ ఇక్బాల్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయన కర్నూలు లోక్‌సభకు పోటీ చేస్తారన్న టాక్ నడిచింది..అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల ఇక్బాల్‌ను విజయవాడ ఇన్‌చార్జ్‌గా పంపారు. దీంతో ఈ ఇద్దరు కూడా జగన్ దృష్టిలో ఉన్నారనే ప్రచారం ఉంది. ఇంతలోనే తాజాగా కర్నూలుకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్ పేరు తెరమీదకు రావడం గమనార్హం. దీంతో స్థానికంగా టికెట్ ఎవరికి లభిస్తుంది? ఎవరు పోటీలో ఉంటారు? అనే కీలక విషయాలపై నేతలు తర్జన భర్జన పడుతున్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.